KCRకు కొత్త భవంతులు, కొత్త కార్లు.. జనం బైబై అంటున్నారు : ప్రియాంక గాంధీ
కేసీఆర్ కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు దక్కాయని.. అతని కుటుంబం కోసం భవనాలు నిర్మించారని.. కొత్త కొత్త కార్లు కొనుగోలు చేశారని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. జహీరాబాద్లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక పాల్గొన్నారు.
Priyanka Gandhi: ఇంట్లో ఉన్న అక్కాచెల్లెళ్ల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఏం చేసిందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అడిగారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు ఆందోళనతో ఉన్నారని చెప్పారు. జహీరాబాద్లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక (Priyanka) మాట్లాడారు. ఎన్నికల సమయం ఇది.. ఆలోచనతో ఓటు వేయాలని కోరారు. ఇక్కడ అవినీతి తీవ్రంగా ఉందన్నారు. పెరుగుతున్న ధరలతో సామాన్యుడు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.
ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ పాలన చేస్తున్నారని ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు దక్కాయని చెప్పారు. కేసీఆర్ ఫ్యామిలీ భవనాలు నిర్మించారని, కొత్త కొత్త కార్లు కొనుగోలు చేశారని వివరించారు. ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని ఆ పార్టీ మరిచిపోయిందని పేర్కొన్నారు. బైబై కేసీఆర్ అంటూ నినాదించారు. మనకు మార్పు కావాలి అని అడిగారు. కాంగ్రెస్ పార్టీలో.. నేతల్లో సేవాగుణం ఉందన్నారు. దేశంలో ప్రజలే ముఖ్యం అని గుర్తుచేశారు. తమ పార్టీ నేతల్లో అహంకారం ఉండదని.. 24 గంటల ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పారు.
తమ ప్రభుత్వం ఏర్పడితే.. మహిళా సంఘాలకు రుణం అందజేస్తామని ప్రకటించారు. ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తోందని చెప్పారు. కాంగ్రెస్ అంటేనే సేవాభావం అని తెలిపారు. దేశంలో ధనిక పార్టీ బీజేపీ అని.. తెలంగాణలో బీఆర్ఎస్ ధనిక పార్టీ అని చెప్పారు. గత 10 ఏళ్ల నుంచి ప్రజల నుంచి వసూల్ చేసిన సొమ్ము బీఆర్ఎస్ పార్టీ వద్ద ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుతో ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచార రథాలు మూగబోనున్నాయి. ఆ తర్వాత ప్రలోభాల పర్వం తెరలేవనుంది. ఇప్పటికే ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద పకడ్బందీగా తనిఖీలు చేస్తున్నారు. 30వ తేదీ గురువారం రోజున ఉదయం 7 గంటలకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు పోలింగ్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి.. సాయంత్రం వరకు విజేతలను ప్రకటిస్తారు.