Telangana election campaign: ఈరోజు సాయంత్రం ఎన్నికల ప్రచారం బంద్
తెలంగాణలో అసెంబ్లీ(telangana assembly elections 2023) ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతలు తమ అభ్యర్థులకు మద్దతు కోరుతూ వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు.
తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికల పోలింగ్ జరగనున్న(telangana assembly elections 2023) నేపథ్యంలో..ఈరోజు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. ప్రస్తుతం చేస్తున్న నేతల ప్రసంగాలు, లౌడ్ స్పీకర్లు, DJ సౌండ్లు, ప్రచార వాహనాలు వీధుల నుంచి అదృశ్యం కానున్నాయి. ఎన్నికల సభలు, రోడ్ షోలు ఉండవు. అంతేకాదు ఈరోజు సాయంత్రం 5 నుంచి ఎన్నికలు ముగిసే వరకు మద్యం దుకాణాలు కూడా బంద్ పాటించనున్నాయి.
ఇక నేడు సాయంత్రం వరకు ప్రచారానికి సమయం ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులు జోరుగా ప్రచారం(election campaign) చేయనున్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నంలో భాగంగా ప్రధాన రాజకీయ నాయకులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో హోరాహోరీగా ప్రచారంలో పాల్గొననున్నారు. ఇప్పటికే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వారి కేబినెట్ మంత్రులు సైతం తెలంగాణ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మరోవైపు కాంగ్రెస్(congress) నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదితరులు మంగళవారంతో తమ ప్రచారాన్ని ముగించనున్నారు. ఇక ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా బీఆర్ఎస్ పార్టీ నేతలు పలు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఆరు హామీలను ప్రకటించి ఓటర్లను, ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేయగా, బీఆర్ఎస్ నాయకులు ధరణి రద్దు, రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తామని కాంగ్రెస్ హామీలను ఎత్తిచూపారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామన్న హామీపై బీజేపీ నేతలు హామీ ఇచ్చారు.