చెదురు ముదురు సంఘటనలు మినహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. ఎల్లుండి ఎన్నికల ఫలితాలను ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
Nagarkurnool: చెదురు ముదురు సంఘటనలు మినహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. ఎల్లుండి ఎన్నికల ఫలితాలను ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే నాగర్ కర్నూల్ లో పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల పరిశీలన బృందానికి చెందిన తుపాను వాహనం ప్రమాద వశాత్తు చెరువులో బోల్తా పడింది. గత నెల రోజులుగా ఎన్నికల పరిశీలన బృందం ఈ వాహనాన్ని ఉపయోగిస్తోంది. ఈక్రమంలో ఉన్నట్లుంది వాహనం ప్రమాదానికి గురికావడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూల్ జిల్లా ఎండబెట్ల గ్రామం కేసరి సముద్రం చెరువు మినీ ట్యాంక్ కట్టపై శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
తుపాను డ్రైవర్ మధు నాగర్ కర్నూల్ వెళ్తుండగా ఎండబెట్ల వద్ద వంతెనపై నుంచి అదుపుతప్పి చెరువులో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములు మునుగుతున్నాయని, అధికారులు వంతెన నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో తరచూ ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.