Hyderabad : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర వ్యతిరేకత రావడం ఈ మధ్య కాలంలో చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక సీఎం రేవంత్‌రెడ్డిపై వివిధ రంగాల ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. హైకోర్టు నిర్మాణానికి మా భూమి ఇవ్వొద్దంటూ గత కొద్దిరోజులుగా అగ్రికల్చర్ యూనివర్శిటీ విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనలు చేయడం మనమంతా చూస్తూనే ఉన్నాం.
ఇప్పుడు డీఎస్సీలో పీఈటీ పోస్టులు పెంచాలని ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ఎదుట స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఉస్మానియా క్యాంపస్‌కు చేరుకుని విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇది ప్రజా పాలన కాదు.. తప్పుడు పాలన అంటూ శాంతియుతంగా దీక్ష చేస్తుంటే.. ఇలా చేయడం సబబు కాదంటూ విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు.