Park చేసిన కారుల్లోంచి రూ.5 లక్షల చోరీ.. ఎక్కడంటే.?
నగదు ఉంటే దగ్గరే ఉంచుకోవాలి.. కారులో పెడితే.. దొంగలు దోచుకునే ప్రమాదం ఉంది. నల్గొండ జిల్లాలో ఓ వ్యక్తి కారులో రూ.5 లక్షలు పెట్టి డోర్ లాక్ చేశాడు. వారిని ఫాలో చేసిన దొంగలు.. ఆ కారు అద్దం పగలగొట్టి నగదును దోచుకెళ్లారు.
Rs.5 Lakhs Theft: దొంగలు చాలా అలర్ట్‌గా ఉంటున్నారు. దొంగతనం చేసేప్పుడు ఒకరిని ఎంచుకొని, వారు ఎప్పుడూ బయటకు వెళుతున్నారు..? ఎప్పుడూ వస్తున్నారు..? ఖాళీగా ఎప్పుడూ దొరుకుతున్నారని కంప్లీట్ వాచ్ చేస్తున్నారు. కింద ఉన్న వీడియోలో దొంగలు చేసిన పని చూసి మీరే అవాక్కవుతారు. కారు పార్క్ చేసి.. భోజనం చేసేందుకు వెళ్లి వచ్చే సరికి గుల్ల చేశారు.
ఈ చోరీ నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో నిన్న జరిగింది. పట్ట పగలే దొంగలు ఇలా బరితెగించారు. దామరచర్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అజ్మీర మాలు వ్యాపార పనుల నిమిత్తం తిరుగుతుంటారు. ఓ ఇంటి స్థలం విక్రయానికి సంబంధించి మిర్యాలగూడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో పని చేసుకున్నాడు. తర్వాత స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లాడు. హోటల్‌కి వెళ్లే సమయంలో కారులోనే నగదు ఉంచాడు. అదే అతను చేసిన తప్పు అయిపోయింది.
అప్పటికే కాచుకొని ఉన్న దొంగలు.. వెంటనే కారు వద్దకు వచ్చారు. నిన్న మధ్యాహ్నాం 1.36 గంటలకు కారు వద్దకు వచ్చినట్టు సీసీటీవీ ఫుటేజీ కనిపిస్తోంది. బైక్ మీద ఒకడు హెల్మెట్ పెట్టుకొని ఉండగా.. మరొకడు కారు వద్దకు వచ్చాడు. ముందు ఉన్న సీటులో బ్యాగ్ చూసి.. అద్దాలను పగలగొట్టాడు. ఇంకేముంది నగదు ఉన్న బ్యాగ్ తీసుకొని.. వెంటనే పారిపోయాడు.
పార్కింగ్ చేసిన కారులో నుండి ఐదు లక్షలు కొట్టేసిన దొంగలు
నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో పట్టు పగలే దొంగలు రెచ్చిపోయారు. దామరచర్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అజ్మీర మాలు ఓ ఇంటి స్థలం విక్రయానికి సంబంధించి మిర్యాలగూడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో పని పూర్తి చేసుకొన్నాడు.… pic.twitter.com/UlWovpfDfJ
రెస్టారెంట్ నుంచి కిందకి వచ్చి చూస్తే కారు అద్దం పగిలి ఉంది. డబ్బులు ఉన్న బ్యాగ్ లేదు. ఇంకేముంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజీ చూడగా.. ఇద్దరు దొంగలు కనిపించారు. వీలైనంత త్వరగా వారిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. సో.. నగదు ఉంటే మీ వెంటే తీసుకొని వెళ్లాలి.. కారులో వదిలి వెళితే ఇలా జరుగుతోంది.