తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దె దింపితేనే మార్పు వస్తుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే ఈ పాదయాత్ర అని రేవంత్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి తన పాదయాత్రను ఇవాళ మేడారం సాక్షిగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ములుగులో రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 9 ఏళ్ల ఈ ప్రభుత్వ పాలనలో రూ.25 లక్షల కోట్లు ఎటుపోయాయి. రాష్ట్రాన్ని బొందలగడ్డగా మార్చారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ రోజే మొదలు పెట్టా. ఇంకా చాలా దూరం పోవాల్సి ఉంది. ఈ రాష్ట్రంలో చేంజ్ రావాలంటే చంద్రశేఖర్ రావు పోవాలి. ఆయన్ను పంపిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందన్నారు.
ములుగు గడ్డకు ఒక చరిత్ర ఉందని.. ఇంకా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దోపిడిని భరిద్దామా? ఏంటి సంక్షేమం అంటే.. పక్క రాష్ట్రానికి వెళ్లి సంక్షేమం గురించి చెబుతున్నాడు. సంక్షేమం అంటే భర్తకు పెన్షన్ ఇచ్చి భార్యకు పెన్షన్ ఇవ్వకుండా అవమానించడం సంక్షేమమా? రైతులకు రుణమాఫి పేరుతో ఇప్పటి వరకు చెల్లించకుండా ఉండటం సంక్షేమమా? ఇంటికో ఉద్యోగం ఇస్తా అని.. నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన చేస్తే లక్షలాది మంది నిరుద్యోగులు బిక్కు బిక్కు మంటూ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండటం సంక్షేమమా? ఆనాడు పేదవాడు వైద్యం అందకుండా చనిపోతుంటే ఆరోగ్యశ్రీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటే.. నువ్వు ఆరోగ్యశ్రీని పాతరేయడం సంక్షమమా.. అంటూ రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.