NRML: జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలలో విద్యుత్ మీటర్ల బిగింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. జిల్లాలోని మొత్తం 381 అంగన్‌వాడీ కేంద్రాలకు మీటర్లు అవసరమవగా, ఇప్పటికే 290 కేంద్రాల్లో మీటర్లు ఏర్పాటు చేశారు. మిగిలిన కేంద్రాల్లో త్వరలోనే పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు నేటి ప్రకటనలో తెలిపారు.
HYD: సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త సర్పంచులకు సరికొత్త కానుకగా గ్రామీణ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. ఆయా గ్రామాలలో కలిపి మొత్తం రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. త్వరలో వార్డుల వారిగా అభివృద్ధి చేపడుతానని వెల్లడించారు.
SRCL: మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సిరిసిల్ల మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రిని కలిసిన వారిలో ఆడెపు చంద్రకళ, బొద్దుల శ్రీనివాస్, వెంగళ లీల, కూరపాటి శ్రీశైలం, లింగంపల్లి గంగరాజు ఉన్నారు. ఈ సందర్భంగా వారిని మంత్రి అభినందించారు.
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ 2 రోజుల విరామం అనంతరం సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్లో సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ. 7,545 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ. 22,100 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ. 37,000పలికింది. తేజ మిర్చి ధర రూ. 18,300 కి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
NLG: సెకండ్ ఎడిషన్ సీఎం కప్ జిల్లా స్థాయిలో నిర్వహించిన వివిధ రకాల ఆటలలో దేవరకొండలోని గిరిజన మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు వివిధ ఆటలలో విజయాన్ని సాధించారు. అనంతరం తదుపరి ఆటలకు ఎన్నికైనట్లు ప్రిన్సిపల్ ఎం.హరిప్రియ సోమవారం తెలిపారు. అథ్లెటిక్స్, సాఫ్ట్ బాల్, జూనియర్ యోగ, యోగ పోటీల్లో పాల్గొని బంగారు, వెండి పథకాలు సాధించినట్లు పేర్కొన్నారు.
NRML: భైంసా పట్టణంలో 141 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను సోమవారం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అర్హులందరికీ పథకాల లాభాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
KNR: సైదాపూర్ మండలంలోని సైదాపూర్-మొలంగూర్ ప్రధాన రహదారిపై సోమారం శివారులో ప్రమాదకరమైన గుంత ఏర్పడింది. రోడ్డు మధ్యలో ఉన్న ఈ గుంత వాహనం సమీపానికి వెళ్లే వరకు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణం మరింత నరకప్రాయంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతను పూడ్చాలని కోరుతున్నారు.
SRD: పటాన్ చెరువు, రామచంద్రపురం, అమీన్ పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాల్లోని పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను చేపట్టే ఈ నియామకాలకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోపు సంబంధిత మండల వనరుల కేంద్రాల్లో (MRC) దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
BDK: అశ్వారావుపేట ప్రభుత్వ మైనారిటీ బాలికల గురుకులంలో నిర్వహించిన ‘మాక్ పార్లమెంట్’ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. ప్రిన్సిపల్ సంగీత రెడ్డి పర్యవేక్షణలో విద్యార్థినులకు పార్లమెంటరీ విధానాలపై శిక్షణ ఇచ్చారు. స్పీకర్‌గా తాజాని, ప్రధానిగా ఎం.డి. ఆయేషా నిమ్రా పాత్రలను సమర్థంగా పోషిస్తూ సభా నిర్వహణను ప్రదర్శించారు. ఉపాధ్యాయులు విద్యార్థినులను అభినందించారు.
HYD: బాధ్యతగల జర్నలిస్టులకు అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్ ప్రభుత్వ కార్డులు అందుతాయని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ అధ్యక్షులు రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు అక్రిడిటేషన్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
BHNG: జిల్లాలో మహిళా సంఘాల కోసం ప్రభుత్వం సొంత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సొంత స్థలం లేక ఇబ్బందులు పడుతున్న సంఘాల కోసం ఒక్కో భవనానికి రూ. 10 లక్షల నిధులు కేటాయించింది. ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే 186 భవనాలకు అనుమతులు లభించాయి. 200 గజాల స్థలంలో నిర్మించే ఈ భవనాలు పూర్తయితే మహిళలు సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది.
KNR: కొత్తపల్లి మండలం రేకుర్తిలో విస్తుపోయే దొంగతనం వెలుగుచూసింది. అమ్మవారికి మట్టెలు చేయిస్తామని, ఆర్థిక సాయం కావాలంటూ ఇద్దరు మహిళలు రాగా.. అనూష అనే యువతి కొంత నగదు సహాయం చేశారు. అయితే అనుషను మాటల్లో దించి, ఆమె నుదుట మత్తుమందు కలిపిన బొట్టు పెట్టారు. ఈ క్రమంలో అనూష స్పృహ కోల్పోగా, అనంతరం ఇంట్లోని నగదు, నగలతో పరారయ్యారని బాధితురాలు ఫిర్యాదు చేశారు.
WGL: గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్మల గ్రామ శివారులో ప్రభుత్వ అనుమతి లేకుండా JCB సాయంతో మట్టి తవ్వి తరలించేందుకు ప్రయత్నించిన వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు గీసుగొండ CI విశ్వేశ్వర్ ఇవాళ తెలిపారు. అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందగానే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితుడిపై కేసు నమోదు చేసి JCBని సీజ్ చేసినట్లు CI వెల్లడించారు.
ADB: ఉట్నూర్ మండలం షాంపూర్‌లో అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ఖానాపూర్ MLA , నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్ వెంటనే స్పందించారు. ప్రమాదంలో గాయపడిన బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే బాధితుల ఆరోగ్య పరిస్థితిని గుర్తించి అవసరమైతే వారిని రిమ్స్‌కు తరలించాలన్నారు.
NLG: ప్రతి ఒక్కరూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం గుండ్లపల్లి(డిండి) మండలం దాసరినెమలిపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 39వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.