NGKL: కుమ్మెర మల్లన్న జాతరలో అగ్రకుల వారు జరిపిన దాడిలో మరణించిన చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి, నష్టపరిహారం ఇవ్వాలన్నారు. బాధితులపై FIR నమోదు చేయడం దుర్మార్గమని ఆగ్రహించారు.
ADB: ఉట్నూర్ మండలంలో సోమవారం ఉదయం షాంపూర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులో పడింది. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను స్థానికులు వెంటనే రక్షించి 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అజాగ్రత్తా లేదా సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
NLG: ప్రతి రెండేళ్లకోసారి వైభవంగా జరిగే నిడమనూరు (M) ఎర్రబెల్లి లింగమంతుల జాతరకు గుట్ట ముస్తాబైంది. అభివృద్ధి పనులు పూర్తికావడంతో లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వస్తారని ఆలయ ఛైర్మన్ వెంకన్న, సర్పంచ్ మధు తెలిపారు.
PDPL: ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా ముత్తారం మండలం సర్వారం గ్రామానికి చెందిన గౌరిశెట్టి రాజయ్య నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు రత్నం శైలేందర్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షులు డా.చిన్న రాముకు కృతజ్ఞతలు తెలిపారు. రిజర్వేషన్లు అందని వెనుకబడిన వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
WGL: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కులం పేరుతో రజక కుటుంబంపై జరిగిన దారుణ దాడిని ABSF జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ ఖండించారు. ఆదివారం రాత్రి WGLలోని కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద ABSF ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. రెండు నెలల పసికందును కాళ్లతో తన్ని హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ADB: ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లను ఈ నెల 27 వరకు పొడిగించినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్ తెలిపారు. రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకుని, సమీపంలోని సీసీఐ కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లుల్లో తమ పత్తిని విక్రయించుకోవాలని సూచించారు. అవకాశాన్ని జిల్లా రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
RR: కొండాపూర్ ఐటీ కారిడార్‌కు సమీపంలోని ఖరీదైన ప్రాంతంలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ఈ భూమిలో ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి వెంటనే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యటనలో ప్రజలు ఆయన పనులను అభినందించారు. దశాబ్దాల సమస్యకు వేగంగా పరిష్కారం లభించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
WGL: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నేడు ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. సత్య శారద తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు, వినతిపత్రాలను నేరుగా అధికారులకు అందజేయవచ్చని ఆమె పేర్కొన్నారు.
NZB: TU లోని ప్రధాన ప్రాంగణంలో SC, ST సెల్ ఆధ్వర్యంలో నేడు గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ 287వ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ వాణి తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బోధన, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు రేపు ఉదయం 11గం.లకు ప్రాంగణంలోని హనుమాన్ ఆలయం వద్దకు చేరుకోవాలని ఆమె సూచించారు.
MLG: జిల్లాలో సాగునీటి సౌకర్యాల విస్తరణకు రాష్ట్ర మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవాళ వినతిపత్రం సమర్పించారు. గోదావరి రైట్ బ్యాంక్‌పై కొత్త ఎత్తిపోతల పథకంతో పాటు, కన్నాయిగూడెం లక్ష్మీపురం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పునరుద్ధరణకు అనుమతి కోరారు. రూ. 22 కోట్లతో 921 ఎకరాలకు సాగునీరు అందించే ప్రతిపాదనను వివరించగా, సీఎం సానుకూలంగా స్పందించారు.
WNP: జిల్లా పెద్దమందడి మండలం కన్మనూరు గ్రామానికి చెందిన మీనిగ బాలయ్య నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ సందర్భంగా ఆదివారం కన్మనూరు గ్రామానికి వెళ్లి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న బాలయ్యను వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పరామర్శించి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
KNR: కాంగ్రెస్ నేతలు వీధి రౌడీల్ల ప్రవర్తిస్తున్నారని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ పాలనలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు.
KMM: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 సీఎం కప్ క్రీడల పోటీలలో ఖమ్మం జిల్లాకు చెందిన పెద్దమునగాల గ్రామానికి చెందిన అభిషేక్ గౌడ్, ఊషు క్రీడలో సబ్ జూనియర్ 48 కేజీల విభాగంలో రాష్ట్రస్థాయిలో బంగారు పతకాన్ని సాధించారు. జాతీయ కోచ్ పరిపూర్ణ చారి వద్ద శిక్షణ పొందుతున్న 8వ తరగతి విద్యార్థి అయిన అభిషేక్ గౌడ్‌ను పాఠశాల యాజమాన్యం అభినందించింది.
SRCL: వీర్నపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. మహబూబ్ నగర్‌లో జరుగుతున్న నెట్ బాల్ పోటీలకు అక్షయ్, ధనుష్, సంజయ్, జగదీశ్ ఎంపికైనట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. అలాగే వరంగల్‌లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో 800 మీటర్ల పరుగు పందెంలో వినయ్ కుమార్, దీపక్ పాల్గొననున్నారు.
MNCL: హైదరాబాద్‌లో జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో మంచిర్యాల జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. అండర్-25 విభాగంలో రాహుల్ బంగారు పతకం, శ్రీజ కాంస్య పతకం సాధించగా, అండర్-14 విభాగంలో చైత్ర కాంస్య పతకం గెలుచుకుంది. విజేతలను DYSO హనుమంత్ రెడ్డి, యోగాసన సంఘం నేతలు అభినందించారు. జిల్లా పేరు నిలబెట్టినందుకు హర్షం వ్యక్తం చేశారు.