MDCL: జిల్లాలో రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొంత గందరగోళంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM కిసాన్ రైతు రిజిస్ట్రేషన్‌ను అనుసంధానం చేయడంతో అగ్రికల్చర్ విస్తరణ అధికారులకు ఇది తలనొప్పిగా మారింది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన రైతులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనం అందనుంది. జిల్లాలో 19,589 మంది రైతులు ఉండగా ఇప్పటి వరకు సుమారు 89% పూర్తయింది.
KMM: తిరుమలాయపాలెంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తర్వాత భర్త పురుగుల మందు తాగి ప్రాణాంతక నిర్ణయం తీసుకున్నాడు. తోటమళ్ల నాగభూషణం రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు మూడు సార్లు ప్రయత్నించగా భార్య జయమ్మ అడ్డుకుంది. దీంతో అడ్డుగా ఉన్న భార్యను హతమార్చినట్లు సమాచారం.
NLG: ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నకిరేకల్ పట్టణంలో నిర్వహించిన 2K రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు, ప్రజలు పాల్గొని ఉత్సాహంగా పరుగులో పాల్గొన్నారు. పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.
ADB: ఈనెల 16వ తేదీన ఇచ్చోడ మండల కేంద్రంలో జరిగే ద్వితీయ బౌద్ధ ధమ్మ పరిషత్ కార్యక్రమ పోస్టర్ సోమవారం నెరడిగొండ మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దాభకె ఉప సర్పంచ్ గణేష్, మాజీ ఎంపీటీసీ రమేష్ ఉన్నారు.
NRPT: మక్తల్ మున్సిపాలిటీలోని 16వ వార్డులో జూనియర్ కాలేజ్ వెనుక భాగంలో ఉన్న ఎల్బి కాలనీ మధ్యలోని మెయిన్ రహదారి పక్కన మంచినీటి పైప్ లైన్ పగిలి నీరు వృథాగా పోతున్నది. ఈ సమస్య తరచుగా జరుగుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వార్డులో మంచినీటి పైపులైన్ సమస్యలు పదేపదే వస్తుండటం వల్ల సమయానికి తాగునీటికి ఇబ్బందిగా మారిందని వారు తెలిపారు.
HYDలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 18 యూనివర్సిటీలను అనుసంధానం చేస్తూ ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (IDEA) పేరుతో నూతన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ వేదిక ద్వారా డిగ్రీ, పీజీ విద్యార్థులకు విద్య, పరిశోధన అవకాశాలతో పాటు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై సమాచారం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
JN: ఈ- వేస్ట్ వల్ల పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. జనగామ మండలంలోని శామీర్‌పేట్ గ్రామ పరిధిలో గల DRC కేంద్రాన్ని సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్‌లో జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేరు చేయాలని ఆయన తెలిపారు.
VKB: తాండూర్ మున్సిపల్ పరిధిలో దీర్ఘకాలంగా ఇంటి పన్ను చెల్లించని బకాయిదారులకు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి స్వయంగా ఇంటింటికి వెళ్లి రెడ్ నోటీసులు అందజేశారు. మొండి బకాయిలు ఉన్న యజమానులు వెంటనే స్పందించాలని, లేనిపక్షంలో మున్సిపల్ చట్టం- 2019 ప్రకారం ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
HYD: నగర ప్రజలకు మరింత మెరుగైన రవాణా సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) బస్సుల GPS ట్రాకింగ్ వ్యవస్థను విస్తరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉన్న బస్సులకు అదనంగా మరిన్ని బస్సుల్లో GPS పరికరాలను ఏర్పాటు చేశారు. దీంతో బస్సుల రాకపోకలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించడం సులభంగా మారుతుందన్నారు.
WNP: వనపర్తి మండలం రాజనగరం PACSలో రైతులకు పంపిణీ చేసేందుకు 450 యూరియా బస్తాలు సిద్ధంగా ఉన్నట్లు PACS కార్యదర్శి మహేందర్, సింగల్ విండో డైరెక్టర్ సంజీవ్ సాగర్ తెలిపారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు యూరియా బుకింగ్ యాప్ ఓపెన్ అవుతుందని.. అవసరం ఉన్న రైతులు యూరియా బుక్ చేసుకోవాలని కోరారు. యూరియా తీసుకొనేప్పుడు రైతు ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్సులు ఇవ్వాలన్నారు.
SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలో వేసవికాలం నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ శ్రీనివాస్ రావు పాటిల్ తెలిపారు. స్థానిక 9వ వార్డులో మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి వార్డు సభ్యులతో కలిసి సర్పంచ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
BDK: గ్యాస్ సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు వచ్చాయి. ఇకపై ఒక సిలిండర్ డెలివరీ అయ్యాక రెండో దాని కోసం 21 రోజులు వేచి చూడాలి. అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల మార్చి 7 నుంచి సిలిండర్ ధర రూ.60 పెరిగింది. మరోవైపు బుకింగ్ చేసిన తర్వాత 24 గంటల లోపు వినియోగదారులకు సిలిండర్ డెలివరీ చేయాలని చమురు కంపెనీలు జిల్లాల ఏజెన్సీలకు సూచించాయి.
MNCL: పట్టణాలు పరిశుభ్రంగా ఉంచి అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందని కాంగ్రెస్ నాయకులు సోమవారం అన్నారు. మంత్రి వివేక్ సహకారంతో రూ. 1 కోటి నిధులతో మందమర్రిలోని ట్యాంక్ బండ్ అభివృద్ధిలోకి తీసుకురానున్నట్లు హామీ ఇచ్చారన్నారు. పట్టణ ప్రజలకు అన్ని రకాల సౌకర్యంగా ఉంటుందన్నారు.
KMR: జుక్కల్ మండల కేంద్రంలో ఈదురు గాలులకు చెట్లపై విద్యుత్ వైర్లు తెగి పడుతున్నాయి. అటుగా వెళ్లే వారు ఈ వైర్లను గమనించకపోతే ప్రాణహాని తప్పదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఈ వైర్లపై అవగాహన లేని చిన్నారులకు సైతం ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. ఈ విషయంపై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ పట్టణం, రెబ్బెన, ఆసిఫాబాద్ రూరల్ మండలాల అధ్యక్ష పదవుల కోసం ఆసక్తి గల నాయకులు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సంప్రదించాలని డీసీసీ అధ్యక్షులు ఆత్రం సుగుణ సోమవారం ఓ ప్రకటనలో కోరారు. వాంకిడి, తిర్యాని మండలాల కార్యకర్తల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించామన్నారు. అర్హులైన నాయకులు నిర్ణీత సమయంలో దరఖాస్తులను అందజేయాలన్నారు.