• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కరకగూడెంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ దినోత్సవం

BDK: ఆపద సమయంలో 24 గంటలు అహర్నిశలు శ్రమిస్తూ, నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకుని 108 సిబ్బంది ప్రాణదాతలుగా నిలుస్తున్నారని వైద్యులు రవితేజ అన్నారు. కరకగూడెంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవితేజ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

April 2, 2026 / 11:30 AM IST

వడదెబ్బతో రైతు మృతి

BHPL: వడదెబ్బతో ఓ యువరైతు మృతిచెందిన ఘటన గణపురం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పెండ్యాల తిరుపతి (34) అనే రైతు బుధవారం సాయంత్రం పనుల నిమిత్తం చేనుకు వెళ్లి, రాత్రి వరకు తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం తోటి రైతులకు పొలంలో తిరుపతి మృతదేహం కనిపించింది. వడదెబ్బతోనే ఆయన మృతి చెందినట్లు గుర్తించారు.

April 2, 2026 / 11:26 AM IST

ఉరుమడ్ల రైతులకు శుభవార్త.. కొనుగోలు కేంద్రం ప్రారంభం

NLG: ఉరుమడ్లలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

April 2, 2026 / 11:25 AM IST

గ్రామ శాఖ అధ్యక్షుడు మృతి.. పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

HNK: శాయంపేట(M) నరసింహులపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు చిలకయ్య నిన్న రాత్రి మరణించారు. ఈ మేరకు నేడు ఆయన పార్థివదేహానికి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను గండ్ర పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

April 2, 2026 / 11:25 AM IST

వనపర్తి కలెక్టర్‌ని కలిసిన వైస్ ఛాన్స్‌లర్

MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని వనపర్తి పీజీ కాలేజ్‌ను ఉపకులపతి ప్రొఫెసర్ జీఎన్. శ్రీనివాస్ ఆకస్మికంగా సందర్శించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిని మర్యాదపూర్వకంగా కలిసి వనపర్తి పీజీ సెంటర్ పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని పీజీ బాలుర వసతి గృహం కోసం కేటాయించాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు.

April 2, 2026 / 11:24 AM IST

గ్రామాల్లోని ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించాలి: MLA

ADB: గ్రామాల్లోని ప్రతి ఒక్క సమస్యను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా నేరడిగొండ మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు.

April 2, 2026 / 11:20 AM IST

108, 102 వాహనాల్లో సిబ్బందికి రేపే ఇంటర్వ్యూలు

MBNR: జిల్లాలోని 108, 102 అంబులెన్సులలో డ్రైవర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కో-ఆర్డినేటర్ ఉదయ్ కుమార్ తెలిపారు. డ్రైవర్‌ పోస్టుకు టెన్త్ పాసై, 35 సం.ల లోపు ఉండాలన్నారు. లైసెన్స్, 3 సం.ల అనుభవం, బ్యాడ్జి నంబర్ కలిగి ఉండాలన్నారు. టెక్నీషియన్‌కు డిగ్రీలో బీజెడ్‌సీ చదివి ఉండాలన్నారు. 108 ఆఫీస్‌లో రేపు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు.

April 2, 2026 / 11:20 AM IST

రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి: ఎస్సై

KNR: ప్రజలు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని కేశవపట్నం ఎస్సై శేఖర్ హెచ్చరించారు. రోడ్డు దాటే ముందు తప్పనిసరిగా ఎడమ, కుడి చూసి వాహనాల వేగాన్ని అంచనా వేసి మాత్రమే ముందుకు వెళ్లాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగెత్తుతూ రోడ్డు దాటకూడదని, పాఠశాలలు, కూడళ్ల వద్ద పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వెల్లడించారు.

April 2, 2026 / 11:17 AM IST

ఈనెల 4న ఉద్యాన నర్సరీలో మామిడికాయల వేలం

MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలోని ప్రభుత్వ ఉద్యాన నర్సరీలో మామిడికాయల బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు అధికారి అర్చన గురువారం ప్రకటనలో తెలిపారు. నర్సరీలోని 300 మామిడి చెట్ల దిగుబడికి ఈనెల 4న ఉదయం 10 గంటలకు వేలం పాట జరుగుతుంది. ఆసక్తి గల వారు రూ.1,000 డిపాజిట్ చెల్లించి పాల్గొనాలన్నారు. మరిన్ని వివరాలకు నర్సరీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

April 2, 2026 / 11:14 AM IST

ధారూర్ మండలంలో కోతుల బీభత్సం

VKB: ధారూర్ మండలంలోని పలు గ్రామాల్లో కోతుల బెడద రోజురోజుకూ మితిమీరిపోతోంది. గుంపులు గుంపులుగా వస్తున్న కోతులు పొలాలపై పడి వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలను చిందరవందర చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయంలో కోతుల ధాటికి నమోదవుతుండటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

April 2, 2026 / 11:13 AM IST

చేర్యాల పట్టణంలో యాక్సిడెంట్

SDPT: చేర్యాల పాత బస్టాండ్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆకునూర్ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని కీర్తన తీవ్రంగా గాయపడింది. తన తాతతో కలిసి టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన కీర్తనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 2, 2026 / 11:07 AM IST

జయంతి వేడుకల్లో పాల్గొన్న BJP జిల్లా అధ్యక్షుడు

WGL: నగరంలోని కాశీబుగ్గలో గల శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ గురువారం ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధిలో నిర్వహించిన 108 హనుమాన్ చాలీసా మహా పారాయణంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పఠించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరారు.

April 2, 2026 / 11:07 AM IST

‘అర్హులైన ప్రతి ఒక్కరూ HPV వ్యాక్సిన్ వేయించుకోవాలి’

KMM: గర్భాశయ క్యాన్సర్ నివారణకు చేపట్టిన HPV వ్యాక్సినేషన్ ప్రక్రియ నేలకొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వేగంగా సాగుతోంది. వైద్య బృందం విస్తృతంగా అవగాహన కల్పించడంతో ఇప్పటివరకు 14-15 ఏళ్ల వయసు గల 164 మంది బాలికలకు టీకాలు వేశారు. ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

April 2, 2026 / 11:05 AM IST

సాయి మందిరంలో భక్తుల సందడి

SDPT: పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో గురువారం భక్తులు పోటెత్తారు. అర్చకులు స్వామివారికి వేద స్వస్తితో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సాయినాథుని దర్శించుకున్న అనంతరం భక్తులు మందిరంలో ధ్యానం చేశారు. ట్రస్ట్ సభ్యులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.

April 2, 2026 / 11:05 AM IST

ప్రభుత్వ ఆసుపత్రిలో సర్పంచ్ ప్రసవం

SDPT: ప్రజాప్రతినిధిగా ఉండి ప్రభుత్వ వైద్యంపై నమ్మకాన్ని చాటారు ఏనగుర్తి సర్పంచ్ ప్రేమలత. ఈమె బుధవారం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. కార్పొరేట్ వైద్యానికి వెళ్లకుండా సర్కారు దవాఖానాలోనే ప్రసవం చేయించుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణలో వైద్యులు మెరుగైన సేవలు అందిస్తున్నారు.

April 2, 2026 / 11:04 AM IST