మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సింధు కాన్ఫరెన్స్ హాల్ వేదికగా ఈ నెల 22న ఉగాది పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మాతెలుగుతల్లి ఆధ్యాత్మిక సంస్థ ప్రతినిధి శ్రీనివాసయ్య తెలిపారు. ఈ ఉత్సవాలకు బెంగళూరు నుండి ప్రత్యేక అతిథులు విచ్చేస్తున్నారని, పాలమూరు జిల్లా వాసులు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
BDK: మణుగూరులోని ఏరియా స్టోర్ సమీపంలో ఉన్న ఈద్గా వద్ద రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఇవాళ ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ‘ఈద్ ముబారక్’ తెలుపుకుంటూ సోదరభావాన్ని చాటుకున్నారు. ఉదయం నుంచే భక్తులు తరలివచ్చి దేశంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని అల్లాహ్‌ను వేడుకున్నారు.
VKB: పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని ఖాంజపూర్ సమీపంలోని తహలే అదీజ్ ఈద్గాలో శాసనమండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసి, శాంతి, ఐక్యతతో పండుగను జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు పాల్గొన్నారు.
NLG: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని బంగారుగడ్డ, అవంతిపురం ఈద్గాల వద్ద శనివారం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేసిన అనంతరం ఆయన వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి, ధార్మిక చింతనకు నిలువుటద్దమని కొనియాడారు.
KMR: పిట్లంలో రంజాన్ పండుగ వేడుకలు శనివారం ఆధ్యాత్మిక ఉత్సాహంతో జరిగాయి. ఈ వేడుకల్లో జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ‘ఈద్ ముబారక్’ అంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలన్నారు.
గద్వాల జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. యాసంగి సాగుకు ఎకరానికి రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం ఆదివారం నుంచి రైతుల ఖాతాల్లో జమ కానుంది. తొలి విడతలో 1,69,299 మంది రైతులకు ప్రాధాన్యత ఇస్తారు. ఫిబ్రవరి 28లోపు పాస్‌బుక్‌లు పొందిన మరో 6 వేల మందికి కూడా సాయం లభిస్తుంది. జిల్లాలో 3.52 లక్షల ఎకరాలకు ఈ సాయం అందనుంది.
BHPL: తిరుమలగిరిలో పట్టపగలు చెత్త ఏరుకునే నెపంతో నీళ్ల మోటార్లు దొంగిలించేందుకు ప్రయత్నించిన మహిళలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గ్రామస్తులు పనులకు వెళ్లిన సమయంలో వరంగల్ (D) శివనగర్‌కు చెందిన కొందరు మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుకుంటున్నట్లు నటిస్తూ విద్యుత్ మోటార్లను సంచిలో వేస్తుండగా గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
RR: యాచారంలోని కుర్మిద్ద, తాటిపర్తి, మర్లకుంటతండా, సింగారం, అయ్యవారిగూడ, నంది వనపర్తి తదితర గ్రామాల్లో నిన్న ఈదురు గాలులతో కూడిన వడవగళ్ల వర్షం కురిసింది. దీంతో వరి, పంట పాలకూర, మెంతికూర, సోయికూర, పూదీన పంటలు పాడైనట్లు రైతులు తెలిపారు. పలుచోట్ల టమాట పంటకు నష్టం వాటిల్లినట్లు చెప్పారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
PDPL: రామగిరి మండలం సుందిళ్ళ గ్రామంలోని పెద్దచెరువులో గుర్రపుడెక్క కనుచూపు మేర పేరుకుపోయింది. అయితే, గుర్రపుడెక్కకు నీటిని పీల్చుకొని చెరువును త్వరగా ఖాళీ చేసే స్వభావం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక సూర్యరశ్మి లేక ఆక్సిజన్ శాతం తక్కువై చేపలు మృత్యువాత పడి నష్టం వాటిల్లుతుందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
HYD: ప్రముఖ మీర్ ఆలం ఈద్గాలో రంజాన్ ప్రార్థనలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. పెద్దఎత్తున తరలివచ్చిన ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ ఈద్గాను సందర్శించారు. భద్రతా ఏర్పాట్లను స్వయంగా సమీక్షించిన ఆయన, ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకున్నారు.
NRML: పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాలలో శనివారం ఉదయం రంజాన్ ప్రార్థనలు ప్రశాంతంగా ముగిసాయి. ముస్లింలు ఉదయాన్నే ఈద్గా చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది.
SRPT: మోతే మండలం రాఘవపురం గ్రామంలోని గ్రామ పంచాయతీలో గుర్తుతెలియని వ్యక్తులు మొదటి పాలకవర్గ సభ్యుల శిలాఫలకాన్ని పగలగొట్టి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మాజీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని, పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులను గ్రామస్థులు కోరారు.
NLG: జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రక్షణ కరువైంది. ఎక్స్ రే విభాగంలో శిక్షణ పొందుతున్న ఓ పారామెడికల్ విద్యార్థినిపై అక్కడే అవుట్‌సోర్సింగ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తి గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు తెగబడుతున్నాడు. దీంతో నిందితుడి వేధింపులు మితిమీరడంతో భరించలేకపోయిన బాధితురాలు శనివారం ‘డయల్ 100’కు ఫిర్యాదు చేసింది.
WGL: వసంత నవరాత్రుల రెండవ రోజు సందర్భంగా WGL జిల్లా కేంద్రంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు శేషు అమ్మవారిని విశేషంగా అలంకరించి.. లక్ష లిల్లీ పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు. నేడు సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ASF: కాగజ్‌నగర్ మండలం వల్లగొండ గ్రామపంచాయతీ సీతానగర్ శివారులో పత్తి చేనులో పసికందును గుడ్డలో కట్టి పడేసిన ఘటన శనివారం వెలుగుచూసింది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శిశువును సురక్షితంగా బయటకు తీసి సంరక్షణలోకి తీసుకున్నారు. పాపను వదిలేసి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.