ADB: నైజీరియా దేశంలో ఆదిలాబాద్ జిల్లా వాసి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన గోనెల మహేందర్ నైజీరియాలోని సిమెంట్ పరిశ్రమలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత మంగళవారం మహేందర్ గుండెపోటుతో మృతి చెందాడు.
MNCL: జన్నారం మండలంలోని దేవునిగూడెంలో మిలిటరీ ఇంజనీరింగ్ ట్రైనీ అధికారుల పర్యటన కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నం వారు ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, సిఎస్సీ మీసేవ కేంద్రాన్ని సందర్శించారు. మొదట పాఠశాలలో విద్యార్థులను కలుసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అలాగే మీ సేవ కేంద్రాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
NRML: దిలావర్పూర్ కేజీబీవీ పాఠశాలలో బేటి బచావో బేటి పడావో పథకం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 45 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. డిసిపిఓ మురళి మాట్లాడుతూ లింగ సమానత్వం బాలికల చదువు సాధికారత బాల్యవివాహాల నిర్మూలన సైబర్ క్రైమ్ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు.
ASF: ఆసిఫాబాద్ జిల్లాలోని మహిళలు, యువతులు ఎవరైనా హింసకు గురైనట్లయితే నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, చిన్నపిల్లల రక్షణ కోసం షీ టీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీం, భరోసా సెంటర్లు పని చేస్తున్నాయన్నారు.
నల్గొండ: యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని యాదగిరిపల్లి శ్రీ దుర్గా మాత అమ్మవారి వార్షిక మహోత్సవానికి ప్రభుత్వానికి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఆహ్వాన పత్రికను ఉత్సవ కమిటీ నిర్వాహకులు గ్రామ పెద్దలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మిట్ట వెంకటయ్య, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ కాటంరాజు, నరహరి, ర్యకల రాజు, తదితరులు పాల్గొన్నారు.
ADB: తాంసి మండలం వడ్డడి మత్తడివాగు ప్రాజెక్టు వివరాలను మంగళవారం జెఈ హరీష్ వెల్లడించారు. ప్రాజెక్ట్ యొక్క పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు కాగా ప్రస్తుతం నీటిమట్టం 275.450 మీటర్లకు చేరుకుంది. నిల్వ సామర్థ్యం 0.336 టీఎంసీలు కాగా గడిచిన 24 గంటల్లో ఇన్ ఫ్లో లేదని, ఔట్ ఫ్లో 80 క్యూసెక్కులుగా వివరించారు. కాలువల ద్వారా సాగునీరు విడుదల చేస్తున్నామన్నారు.
నల్గొండ: కనగల్ ఉన్నత పాఠశాలలో పురాతన నాగేంద్రుని రాతి విగ్రహం బయటపడిందని స్థానికులు తెలిపారు. పాఠశాల్లో బాత్రూంల నిర్మాణం కోసం తవ్వకాలు నిర్వహిస్తుండగా ఈ విగ్రహం బయట పడిందన్నారు. ఈ విగ్రహం కాకతీయుల, రెడ్డి రాజుల పరిపాలనా కాలానికి చెందినదిగా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ కనగల్ వాగులో ఓ విగ్రహం కనిపించిందని స్థానికులు పేర్కొన్నారు.
NLG: జిల్లా బీజేపీ అధ్యక్షులుగా నియమితులైన డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డికి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి గౌడ్ అభినందనలు తెలిపారు. నాగం వర్షిత్ రెడ్డిని రెండోసారి జిల్లా బీజేపీ అధ్యక్షులుగా నియమించిన జాతీయ పార్టీకి, రాష్ట్ర పార్టీకి నియామకానికి సహకరించిన పార్టీ పెద్దలకు రవి గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
NLG: మామను కోడలు హతమార్చిన ఘటన డిండి మండలం గోనబోయినపల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ గొడవల నేపథ్యంలో మామ బద్దె రాములు (65)ను పెద్దకోడలు పెద్దులమ్మ కర్రతో కొట్టి రోడ్డుపై నెట్టి వేయగా రాములు తల వెనుక భాగంలో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
BDK: ఇల్లందు మండలం రాజీవ్ నగర్ తండా సమీపంలోని క్వారీలో మంగళవారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 24 ఏరియాకు చెందిన పల్లపు ఎల్లయ్య (40) మట్టి పెళ్ళలు పడి మరణించాడని స్థానికులు చెప్పారు. పెద్ద సైజు రాళ్లు కొడుతూ కాసేపు సేద తీరుతున్న సమయంలో మట్టి పెళ్లలు పడినట్లు తెలిపారు. గాయపడిన అతడిని తోటి కార్మికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడని అన్నారు.
KMM: 10వ తరగతి వరకు తమతో కలిసి చదువుకొని అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితులకు తోటి స్నేహితులు అండగా నిలిచారు. కామేపల్లి మండలం పండితాపురంకు చెందిన వీరయ్య, వెంకట్, ధనమ్మ కొమ్మినపల్లి హై స్కూల్ 1985- 86లో 10 తరగతి చదివారు. ముగ్గురు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు మంగళవారం తమ వంతు సహాయంగా రూ.38 వేలు అందజేశారు.
ADB: జిల్లాలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈనెల 5న TSKC ఆధ్వర్యంలో TASK సౌజన్యంతో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సంగీత, TSKC కోఆర్డినేటర్ శ్రావణి పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో HETERO లాబొరేటరీస్‌లో ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్‌లో పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఐటిఐ, పాసైన యువకులు మాత్రమే అర్హులన్నారు.
జనగామ: జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై అవగాహన పోస్టర్లను అదనపు కలెక్టర్, సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఈఓ రమేష్, డీడబ్ల్యూవో ఫ్లోరెన్స్, డీపీఓ స్వరూప, తదితరులు పాల్గొన్నారు.
JGL: జిల్లాలో విధులు నిర్వర్తించి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతిచెందిన ఎస్ఐ రాజమౌళి కుటుంబానికి ఎస్పీ అశోక్ కుమార్ చేతుల మీదుగా రూ.4 లక్షలు ఆర్థికసాయం సోమవారం అందించారు. 2012 బ్యాచ్‌కు చెందిన ఏపీ, టీజీ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఎస్ఐలు కలిసి తోటి మిత్రుడు రాజమౌళి కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వారందరూ కలిసి రూ.4 లక్షలు పోగుచేసి అందించారు.
PDPL: రెండు రోజుల విరామం తర్వాత జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ ప్రారంభం కాగా.. క్వింటా పత్తి ధర రూ.7,170 పలికింది. సోమవారం మార్కెట్ రైతులు 13 వాహనాల్లో 77 క్వింటాల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,170, కనిష్ఠంగా రూ.6,900 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. గత వారం కంటే తాజాగా పత్తి ధర రూ.20 పెరిగింది.