• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రేపు నల్ల పోచమ్మ ఆలయం మూసివేత

SRD: మనూరు మండలం బోరంచ నల్ల పోచమ్మ ఆలయాన్ని రేపు చంద్రగ్రహణం సందర్భంగా మూసివేస్తున్నట్లు ఈవో శివరుద్రప్ప సోమవారం తెలిపారు. మంగళవారం ఉదయం 5 గంటలకు అభిషేకం, అలంకరణ అనంతరం ఉదయం 06:00 గంటలకు ఆలయం మూసి వేస్తారని చెప్పారు. మరుసటి రోజు బుధవారం ఆలయం శుద్ధి, సంప్రోక్షణ తర్వాత అభిషేకం చేసి ఉదయం 8 గంటలకు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామని చెప్పారు.

March 2, 2026 / 12:38 PM IST

మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది: ఎమ్మెల్యే

RR: షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధి 7వ వార్డులో సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రోడ్డు, డ్రైనేజీ, తాగునీరు వంటి అంశాలను కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధికి ఎన్ని నిధులు అయినా తీసుకువస్తానని, అధికారులు, కౌన్సిలర్లు బాధ్యతాయుతంగా పని చేయాలని తెలిపారు.

March 2, 2026 / 12:37 PM IST

‘విద్యార్థుల విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం’

MNCL: సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం, విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి భాగ్యవతి తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని బాలుర సమీకృత వసతి వసతి గృహాన్ని సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి భోజన సరఫరా, త్రాగునీరు, వసతి, వంటశాల ఏర్పాట్లను పరిశీలించారు.

March 2, 2026 / 12:33 PM IST

నిజాలాపూర్‌లో దొంగ పట్టివేత

MBNR: మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామస్థులు సాహసం చేసి ఓ దొంగను పట్టుకున్నారు. అదే గ్రామానికి చెందిన శివ ఖరీదైన ఐఫోన్లు, ల్యాప్టాప్లు, బైక్లు వరుసగా దొంగతనం చేస్తూ జల్సాలు చేస్తున్నాడన్న అనుమానంతో నిలదీశారు. అతని ఇంట్లో సోదాలు చేయగా భారీగా చోరీ సొత్తు లభ్యమైంది. నిందితుడిని, స్వాధీనం చేసిన వస్తువులను పోలీసులకు అప్పగించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

March 2, 2026 / 12:32 PM IST

ప్రజలకు మెరుగైన పాలన అందిస్తాం: ఛైర్పర్సన్

VKB: తాండూరు పట్టణ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని మున్సిపల్ ఛైర్పర్సన్ పట్లోళ్ల నీరజ బాలరాజు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాండూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

March 2, 2026 / 12:32 PM IST

136 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్ విడుదల

HYD: మహానగర తాగునీటి సరఫరా బలోపేతానికి HMWSSB ఆధ్వర్యంలో మంజీరా, గండిపేటకు మరో రెండు పైపులైన్లు వేయాలని నిర్ణయించారు. HYDలో 300 వార్డులకు విస్తరించిన వేళ పని భారం మోసేందుకు అధికారులు అవసరం కానున్నారు. దీంతో 136 మేనేజర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది.

March 2, 2026 / 12:31 PM IST

జూనియర్ కళాశాల వేడుకలలో ఎమ్మెల్యే

BHNG: వలిగొండ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు అయినా సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి , ప్రభుత్వ జూనియర్ కళాశాల కట్టించినటువంటి దాత పైళ్ళ మల్లారెడ్డి ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో ఈ కాలేజీ నిర్మించిన పైళ్ళ మల్లారెడ్డికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

March 2, 2026 / 12:31 PM IST

రంజాన్ సందర్భంగా డీఎస్పీ కీలక సూచనలు

ASF: ఎస్పీ ఆదేశాల మేరకు కాగజ్ నగర్ డీఎస్పీ కార్యాలయంలో ముస్లిం పెద్దలు, వ్యాపారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. డీఎస్పీ వహీదుద్దీన్ మాట్లాడుతూ.. రంజాన్ పండుగ వేళ నిర్ణీత సమయం వరకే దుకాణాలు నిర్వహించాలని సూచించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.

March 2, 2026 / 12:30 PM IST

వీధిలైట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం

KMM: మధిర మండలం ఇల్లూరు గ్రామంలో ఎల్ఈడి వీధిలైట్ల ఏర్పాటు కార్యక్రమం సోమవారం సర్పంచ్ చేకూరి ఆదిలక్ష్మి స్వయంగా పర్యవేక్షించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామంలో అనేక వీధులు చీకటిలో మగ్గిపోతుండగా గ్రామస్తుల సమస్య తెలుసుకొని దగ్గరుండి సర్పంచ్ పరిష్కరించారు. గ్రామ అభివృద్ధికి తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని ఆదిలక్ష్మి వెల్లడించారు.

March 2, 2026 / 12:29 PM IST

రాష్ట్రస్థాయి అవార్డు సాధించిన అఖిల్

KMR: పల్వంచ మండలం భవానిపేటకి చెందిన అఖిల్ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందాడు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్, డైరెక్టర్ నవీన్ నికోలస్ చేతుల మీదుగా పీఎం-పోషణ్ పథకం అమలులో ఉత్తమ పురస్కారం అందుకున్నాడు. ఈ సందర్భంగా అఖిల్ తండ్రి, ఉపసర్పంచ్ రమేశ్ గౌడ్ మాట్లాడుతూ.. అఖిల్ రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు.

March 2, 2026 / 12:28 PM IST

భైంసా మున్సిపల్ కమిషనర్‌గా జగదీశ్వర్ గౌడ్

NRML: భైంసా మున్సిపల్ కమిషనర్ గా జగదీశ్వర్ గౌడ్ నియామకం అయ్యారు. నిర్మల్ కమిషనర్‌గా పని చేస్తున్న జగదీశ్వర్ గౌడ్‌ను భైంసా మున్సిపల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. ఆ శాఖ డైరెక్టర్ శ్రీదేవి గత నెల 28వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం భైంసా కమిషనర్‌గా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

March 2, 2026 / 12:27 PM IST

సమయపాలన పాటించని ఎంపిడివో సిబ్బంది

MLG: కన్నాయిగూడెం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సమయపాలన పాటించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయ సిబ్బంది ఆలస్యంగా హాజరుకావడం, పనులు వాయిదా వేయడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

March 2, 2026 / 12:27 PM IST

ORR నుంచి RRR.. రేడియల్ రోడ్లపై HMDA కసరత్తు

HYD: నగర శివారు ORR నుంచి RRR అంతర్గత ప్రాంతాలను కలుపుతూ మొత్తం 10 రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో HMDA అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ORR ఎగ్జిట్–17 వద్ద బుద్వేల్ నుంచి కోస్గి వరకు రెండు రేడియల్ రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు

March 2, 2026 / 12:23 PM IST

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

MLG: గోవిందరావుపేట(M) పస్రాలోని అభ్యుదయ కాలనీలో సోమవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో రవి అనే వ్యక్తి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని ఫ్రిజ్ ఇతర విలువైన వస్తువులు కూడా మంటల్లో బూడిదైపోయాయి. వెంటనే స్థానిక ప్రజలు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 2, 2026 / 12:21 PM IST

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..!

MDK: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం చేగుంట మండలంలో కలకలం రేపింది. పోలంపల్లి సర్పంచ్ రాజ్యలక్ష్మి తెలిపిన వివరాలు.. గ్రామ శివారులోని రోడ్డు పక్కన ఒక మగ వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 2, 2026 / 12:21 PM IST