• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

విద్యార్థులందరికీ హాల్ టికెట్ అందజేయాలి: PDSU

ADB: జిల్లాలోని ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ హాల్ టికెట్ అందజేయాలని PDSU జిల్లా కార్యదర్శి కుమ్ర అశోక్ తెలిపారు. ఫీజులు చెల్లించలేదని హాల్ టికెట్లు ఇవ్వకపోతే సంబంధిత యాజమాన్యాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్ డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌తో పరీక్ష రాసే అవకాశం కల్పించిందని తెలిపారు.

February 24, 2026 / 07:23 AM IST

‘పంచాయతీరాజ్ చట్టం‌పై అవగాహన కలిగి ఉండాలి’

SRCL: వార్డు సభ్యులు పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని ఎంపీడీవో రాధా అన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం ఇటీవల నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ సమగ్ర అభివృద్ధిలో వార్డు సభ్యులు కూడా కీలక పాత్ర వహిస్తారని తెలిపారు.

February 24, 2026 / 07:22 AM IST

చైనా మాంజాకు నెమలి బలి

NLG: మర్రిగూడ మండలం బట్లపల్లిలో చైనా మాంజా చుట్టుకుని నెమలి మృతి చెందింది. రైతు పొలంలో ఆహారం కోసం వెళ్లిన నెమలి కాళ్లకు దారం చుట్టుకోవడంతో ప్రాణాలు కోల్పోయింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అఖిలేశ్ సమక్షంలో పశువైద్యాధికారి సురేందర్ పోస్టుమార్టం నిర్వహించి, నెమలిని ఖననం చేశారు. పర్యావరణానికి హానికరమైన చైనా మాంజాను వాడొద్దని అధికారులు సూచించారు.

February 24, 2026 / 07:21 AM IST

సోడా తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి

WGL: నగరంలోని గిర్మాజీపేటలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా “న్యూలెమన్ సోడా” తయారు చేస్తున్న సమాచారం మేరకు నేడు టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా వ్యాపారి వెంకటేశ్వర్లు ఇంట్లో రూ. 24 వేల విలువైన సోడా సీసాలు, సామగ్రిని స్వాధీనంచేసుకున్నారు. వాటిని ఆహార భద్రత అధికారులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.

February 24, 2026 / 07:19 AM IST

ఇకపై మధ్యవర్తులు లేకుండా నేరుగా CMPF సేవలు

MNCL: బెల్లంపల్లి ఏరియా GM కార్యాలయంలో సింగరేణి ‘ప్రయాస్’ సమావేశం నిర్వహించారు. CMPF రీజినల్ కమిషనర్ హరి పచౌరి పాల్గొని కార్మికులకు పలు సూచనలు చేశారు. గుర్తింపు సంఘం నాయకులు, కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. CMPF లావాదేవీలన్నీ ఇకపై C-CARES పోర్టల్ ద్వారానే జరుగుతాయని, మధ్యవర్తులు లేకుండా నేరుగా సేవలు పొందవచ్చని అయన పేర్కొన్నారు.

February 24, 2026 / 07:17 AM IST

పశువుల స్వైరవిహారం.. భయందోళనలో ప్రజలు

SRPT: సూర్యాపేట మున్సిపల్ పరిధిలో పశువుల సంచారం మితిమీరుతోంది. పగలు వార్డుల్లో, రాత్రి వేళల్లో మెయిన్ రోడ్లపై ఆవులు తిష్టవేయడంతో వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి రోడ్లపై పశువుల సంచారం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

February 24, 2026 / 07:15 AM IST

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు ఏర్పాటు: అదనపు కలెక్టర్

KMM: జిల్లాలో పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 10 వరకు జరిగే ఈ పరీక్షలకు 16,975 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని విద్యాశాఖను ఆదేశించారు.

February 24, 2026 / 07:13 AM IST

నగరంలో భారీ వర్షం.. మరి కొన్ని గంటల్లో..

హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి అల్వాల్, జూబ్లీహిల్స్, బషీర్ బాగ్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే కొన్ని గంటల్లో నగరమంతా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని మ్యాప్ విడుదల చేసింది.

February 24, 2026 / 07:06 AM IST

‘పత్తిపాకలో ప్లాస్టిక్ వాడకం నిషేధం’

PDPL: ధర్మారం మండలం పత్తిపాకలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధిస్తూ పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. ప్లాస్టిక్ కవర్లు వినియోగించిన, బహిరంగ ప్రదేశాలలో పడవేసిన వారికి జరిమానా విధిస్తామని తెలిపారు. ప్లాస్టిక్ వాడకం నిరోధించి భావితరాలకు ప్రాణాధారం కల్పించాలని గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. స్వచ్ఛ గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

February 24, 2026 / 07:05 AM IST

‘గోదావరి పుష్కర ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’

NZB: 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గత పుష్కరాల్లో గోదావరిలో పుష్కర స్నానం చేసిన భక్తుల సంఖ్య, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్టాళ్లు, తాగునీరు, తాత్కాలిక గదులు, ఏర్పాట్లు చూడాలన్నారు.

February 24, 2026 / 07:05 AM IST

ఆన్‌లైన్ హాల్ టికెట్‌ ఉన్నా పరీక్షకు అనుమతి

KNR: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 36,426 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 57 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా ఆన్‌లైన్‌ హాల్ టికెట్‌తోనే పరీక్షలకు హాజరుకావచ్చని RIEO గంగాధర్ స్పష్టం చేశారు.

February 24, 2026 / 07:04 AM IST

సైబర్ క్రైమ్ నేరాల అదుపునకు ప్రత్యేక దృష్టి: SP

ADB: సైబర్ క్రైమ్ పై ఉక్కు పాదం మోపుతూ, నేరాలను తగ్గించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం మరో అడుగు ముందుకు వేసిందని SP అఖిల్ మహాజన్ తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాలకు పరోక్షంగా సహకరిస్తూ మోసాలు చేస్తున్న నిందితులు ఇర్ఫాన్, సాహిల్, అనాస్ ను అరెస్టు చేయడం జరిగిందని పేర్కొన్నారు. నిందితులపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

February 24, 2026 / 07:02 AM IST

నేడు కుమ్మెరకు బీసీ కమిషన్ ఛైర్మన్ రాక

NGKL: కుమ్మెరలో జరిగిన చిన్నారి మౌనిక మృతి ఘటనపై విచారణకు తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ మంగళవారం రానున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు గ్రామానికి చేరుకుని, ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించడంతో పాటు బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారుల నుంచి కమిషన్ నివేదిక కోరింది.

February 24, 2026 / 07:02 AM IST

రాష్ట్ర స్థాయిలో మెరిసిన దివ్యాంగ విద్యార్థులు

KMR: జిల్లా దివ్యాంగ విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు.HYD దోమలగూడలో ఈనెల 17న నిర్వహించిన పోటీల్లో జిల్లా నుంచి 30 మంది పాల్గొన్నారు.12 మంది ట్రోఫీలు, బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు సాధించారు. అథ్లెటిక్స్, షాట్‌పుట్, లాంగ్ జంప్, రన్నింగ్ ఈవెంట్స్‌లో తమ సామర్థ్యాన్ని చాటారు. విజేతలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సత్కరించారు.

February 24, 2026 / 07:01 AM IST

పారిశుద్ధ్య లోపంపై కమిషనర్ హెచ్చరిక

వరంగల్ నగరంలో చెత్త వేసే ప్రాంతాలను శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ హెచ్చరించారు. సోమవారం గ్రేటర్ వరంగల్‌లోని కాకతీయ కాలనీ, కేయూసీ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెత్త క్లియర్ చేయని ఇద్దరు జవాన్లకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున జరిమానా విధించాలని అధికారులకు ఆదేశించారు.

February 24, 2026 / 07:00 AM IST