WNP: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమానికి వచ్చే అర్జీలను ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారాలను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి 35 ఫిర్యాదులు అందాయి. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని ఆదేశించారు.
SRPT: కేరళలోని కొల్లం అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థి బిందు కృష్ణ తరపున చేపట్టిన రోడ్ షోలో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలంబా, నియోజకవర్గ ఎన్నికల ఇన్‌ఛార్జ్, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి పాల్గొన్నారు. ప్రజలను కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వారు కోరారు.
HYD: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణిలో 39 ఫిర్యాదులు అందినట్లు ఆమె పేర్కొన్నారు. వాటిని వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు.
NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామం లోని దేవాలయ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఇవాళ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ భూముల్లో ప్రైవేటు వారు చేపట్టిన పనులను నిలిపివేసి ప్రభుత్వ భూములను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
WGL: పర్వతగిరి (M)లోని ప్రతిపాదిత 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సమీపంలోని డంపింగ్ యార్డ్ వద్ద ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. సత్య శారదకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లడుతూ.. వర్షాకాలం రావడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలుగుతున్నది తెలిపారు.
MDCL: అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ మేరకు ఓ పాఠశాలకు చెందిన 14 ఏళ్ల బాలికలకు క్యాన్సర్ నివారణ కోసం ఈ వ్యాక్సిన్ అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్‌తో పాటు అరుణ, వెంకటమ్మ, లింగారెడ్డి, సాజిద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
SDPT: జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో సోమవారం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పంట వైవిధ్యీకరణ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డా. సి.హెచ్. పల్లవి మాట్లాడుతూ.. రైతులు కేవలం వరి, పత్తి పైనే ఆధారపడకుండా మొక్కజొన్న, మినుము, పెసర, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో పాల్గొన్నారు.
NZB: బాల్కొండ మండలం వన్నెల్ బిలో అగ్ని ప్రమాదం జరిగింది. హనుమాన్ ఆలయం సమీపంలోని ముగ్గురు అన్నదమ్ములకు చెందిన ఇల్లు సోమవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ.3,15,000 నగదు కాలిపోయినట్లు బాధితులు వాపోయారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ADB: ఇంద్రవెల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి కాలం దృష్ట్యా వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు దీన్ని ఏర్పాటు చేశామని సిబ్బంది తెలిపారు. నీటిని వృథా చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
WNP: వసతి గృహాలు, సంక్షేమ హాస్టల్స్‌లో విద్యార్థులకు నిబంధనల ప్రకారం మెనూ అనుసరించి నాణ్యమైన భోజనం పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం వనపర్తి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన అధికారులతో సమీక్షించారు. సంక్షేమ విద్యాలయాలను సంబంధిత అధికారులు సందర్శించి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అనే విషయాలపై ఆరా తీయాలని ఆదేశించారు.
NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లి ZPHS విద్యార్థులకు, 2007-08 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు మజ్జిగ వితరణ చేపట్టారు. పాఠశాల చివరి రోజు ఏప్రిల్ 23 వరకు ఈ పంపిణీ కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ బత్తుల లక్ష్మి ప్రసన్న నరసింహ మాట్లాడుతూ.. చొరవ చూపిన పూర్వ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఎం రమాదేవి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీలో సోమవారం పత్తి ధరలు నిలకడగా కొనసాగాయి. గత వారం ముగింపులో (గురువారం) పలికిన గరిష్ఠ ధరనే ఈ వారం ప్రారంభంలోనూ మార్కెట్ దక్కించుకోవడం విశేషం. ఇవాళ మార్కెట్‌కు రైతులు మొత్తం 10 వాహనాల్లో 50 క్వింటాళ్ల విడి పత్తి తీసుకుని రాగా గరిష్ఠంగా రూ. 7,700, కనిష్ఠంగా రూ. 6,500 పలికింది. తక్కువ తేమ శాతం ఉండి, నాణ్యత ఉండాలన్నారు.
BHNG: మోత్కూర్, అడ్డగూడూర్ మండలాలలోని దళిత బందు రెండో విడత లబ్ధిదారులకు గత ప్రభుత్వం దాదాపు 254 మందికి రెండో విడత కింద నిధులు కేటాయించడం జరిగింది. తరువాత ప్రభుత్వాలు మారడంతో ప్రీజింగ్‌లో పెట్టిన 3 లక్షల రూపాయలను వారి ఖాతాలో వేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారడం మాకు నిధులు ఇవ్వడంలో మొండి చేయి చేయించడం జరిగింది.
HNK: GWMC 44, 45, 46, 64 డివిజన్లలో నూతన కాంగ్రెస్ కమిటీల ఎన్నిక నేపథ్యంలో ఆశావాహుల నుంచి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి దరఖాస్తులను స్వీకరించారు. 4 డివిజన్లకు గానూ 26 పైగా దరఖాస్తులు వచ్చాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ.. మహిళలకు 30% రిజర్వేషన్ అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
VKB: తమ సమస్యలను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యుత్ కార్యాలయం ఎదుట సోమవారం కాంట్రాక్టు కార్మికులు ధర్నా చేపట్టారు. సంఘం నాయకుడు మహేష్ మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి విధుల్లో కొనసాగుతున్న తమ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. పెండింగ్‌లోని సమస్యలను పరిష్కరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.