Uttam: మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కాంగ్రెస్ పార్టీతో అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. పీసీసీ చీఫ్ పదవీ నుంచి తప్పుకున్నాక దూరం దూరంగానే ఉంటున్నారు. యాక్టివ్గా లేకపోవడంతో ఉత్తమ్ పార్టీ వీడతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన భార్య పద్మావతితో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరతారని ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పందించారు. కాంగ్రెస్ పార్టీని వీడటం లేదని స్పష్టంచేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టంచేశారు. పార్టీ వీడుతున్నారని దుష్ప్రచారం చేయొద్దని తేల్చిచెప్పారు.
ఉత్తమ్ (Uttam) పార్టీ మార్పు అంశంపై భట్టి విక్రమార్క కూడా స్పందించారు. ఎవరో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ్ కాంగ్రెస్ పార్టీలో పుట్టి, పెరిగారని చెప్పారు. ఆయన అణువు అణువు కాంగ్రెస్ పార్టీయేనని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తోన్న వ్యక్తి ఉత్తమ్ అని వివరించారు. రక్షణ శాఖలో మంచి పొజిషన్లో ఉన్నప్పుడే బయటకు వచ్చారని గుర్తుచేశారు. ఉత్తమ్ కొలిగ్స్ ఇప్పుడు కీలక స్థానాల్లో ఉన్నారని తెలిపారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా పనిచేశారని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేందుకు కృషి చేశారని.. గత 10 ఏళ్లుగా ఉత్తమ్ పడిన కష్టం అందరికీ తెలుసు అని చెప్పారు. పార్టీ జెండా మీద వేసుకొని పనిచేశారని.. అలాంటి వారిపై కామెంట్స్ చేయొద్దని హితవు పలికారు. ఉత్తమ్లో (Uttam) ప్రవహించేది కాంగ్రెస్ పార్టీ రక్తమేనని స్పష్టంచేశారు.