Sunitha Laxma Reddy: నర్సాపూర్ బీఆర్ఎస్ టికెట్ కన్ఫామ్ అయ్యింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ఈ సారి అవకాశం ఇవ్వలేదు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి (Sunitha Laxma Reddy) టికెట్ కేటాయించారు. మదన్ రెడ్డికి లోక్ సభ టికెట్ ఇస్తామని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో భేటీ అయిన బీఆర్ఎస్ కోర్ కమిటీ సభ్యులు సునీతకు టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మదన్ రెడ్డి పార్టీలో తొలి నుంచి కొనసాగుతున్న సీనియర్ నేత అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆయన తనకు 35 ఏళ్ల సన్నిహితంగా ఉన్నారని పేర్కొన్నారు.
మదన్ రెడ్డి ఆప్తుడు అని. తనకు కుడి భుజం లాంటి వాడని తెలిపారు. మదన్ రెడ్డి సోదర సమానుడు. పార్టీ ఆలోచనలను గౌరవించి, నర్సాపూర్ ఎన్నికను తన భుజ స్కందాల మీద వేసుకుని సునీతా లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్న మెదక్ లోక్ సభ స్థానం నుండి మదన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. మెదక్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఆయనకు పేరు ఉంది. వివాద రహితుడు, సౌమ్యుడు మదన్ రెడ్డి సేవలను పార్టీ మరింత గొప్పగా వినియోగించుకోవాల్సి ఉందని కేసీఆర్ అంటున్నారు.
సునీతా లక్ష్మారెడ్డికి నర్సాపూర్ నియోజకవర్గ బీఫామ్ ఇవ్వడం సంతోషం కలిగించిందని మదన్ రెడ్డి అంటున్నారని, సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోయి పార్టీ ప్రతిష్టను ఆయన మరింత ఇనుమడింప చేశారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.