పెళ్లంటే (Marriage) జీవితంలో ఒక రోజు చేసుకునే అద్భుతమైన వేడుక. దీనికోసం తాహత్తుకు మించి తల్లిదండ్రులు (Parents) వాళ్ల పిల్లల పెళ్లిళ్లు చేయాలని భావిస్తారు. అలా ఓ యువతి తల్లిదండ్రులు కూడా తమ శక్తికి మించి కానుకలు ఇచ్చి ఓ యువకుడికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. బంగారు ఆభరణాలు, ఖరీదైన గడియారంతో భారీగా కట్న కానుకలు సమర్పించారు. అన్నీ బాగున్నాయని ముహూర్తాలు నిర్ణయించుకుని పెళ్లి పనులు మొదలయ్యాయి. పెళ్లికి ముందర నిర్వహించిన సంగీత్ లో అసలు స్వరూపం బయటపడింది. పెళ్లి కొడుకు పచ్చి తాగుబోతు. సంగీత్ లో తాగి బంధువులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో యువతి పెళ్లి రద్దు చేసుకుంది. పైగా ఇచ్చిన కట్నం డబ్బులు, కానుకలు తిరిగి ఇవ్వాలని కోరితే ఆ యువకుడు ససేమిరా అంటున్నాడు. ఈ సంఘటన తెలంగాణలో (Telangana) చోటుచేసుకుంది.
హైదరాబాద్ (Hyderabad) జూబ్లీహిల్స్ (Jubilee Hills)లో నివసిస్తున్న ఓ యువతి (24) కుటుంబసభ్యులకు ఏపీలోని చిత్తూరుకు (Chittore) చెందిన ఫైనాన్స్ వ్యాపారి ఎ.రవిబాబు కుటుంబంతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాలు కాస్త బంధువులు కావాలని నిర్ణయించుకున్నారు. రవిబాబు కుమారుడు ఎ.వైష్ణవ్ తో తమ కుమార్తె వివాహం కుదిర్చారు. కట్నంగా రూ.3 కోట్లు ఇస్తామని చెప్పారు. గతేడాది సెప్టెంబర్ లో తిరుపతిలోని (Tirupati) తాజ్ హోటల్ లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయగా అర్ధాంతరంగా రద్దయ్యింది. పలు కారణాలుగా నిశ్చితార్థం జరగలేదు.
నేరుగా పెళ్లి చేద్దామని నిర్ణయించుకుని ఫిబ్రవరి 9న డిస్టినేషన్ పెళ్లి నిర్వహించాలని పెళ్లి కొడుకు డిమాండ్ చేశాడు. సరేనని మొయినాబాద్ (Moinabad)లోని బ్రౌన్ టౌన్ రిసార్ట్ (Brown Town Resort)లో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 7 నుంచి 10 దాకా రిసార్ట్ (Resort) బుక్కయ్యింది. సుమార్ రూ.50 లక్షలతో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. పెళ్లికి ముందు సంగీత్ (Sangeet) సందడిగా జరిగింది. ఆ సమయంలో పెళ్లి కొడుకు వైష్ణవ్ డ్రగ్స్ తీసుకున్నాడు. మద్యం సేవించాడు. అనంతరం మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదేమిటని పెళ్లి కూతురు, బంధువులు నిలదీయగా వారిపై వైష్ణవ్ తో పాటు అతడి స్నేహితులు దాడికి పాల్పడ్డారు. పెళ్లికి ముందే అతడి నిజస్వరూపం తెలియడంతో యువతి వివాహం రద్దు చేసుకుంది.
కాగా పెళ్లి కోసం చేసిన ఖర్చులు, ఇచ్చిన కట్నకానుకలు తిరిగి ఇవ్వాలని వధువు తల్లిదండ్రులు కోరారు. వరుడి కుటుంబసభ్యులను ఎంత అడిగినా వాటిని తిరిగివ్వడం కుదరదని చెప్పారు. ఉల్టా బెదిరింపులకు పాల్పడుతుండడంతో యువతి కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. వరుడి కుటుంబం రవిబాబు, దేవి, తేజు, శ్రవణ్, వైష్ణవ్ తో పాటు శరత్ రెడ్డి, మనోజ్, భరత్ తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.