Minister Uttam Kumar: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నీటిపారుదల రంగంపై శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ చాలా ముఖ్యమైనంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా గత ప్రభుత్వం 19 లక్షల ఎకరాలకు నీరిచ్చే ఆలోచన చేసింది. దురదృష్టవశాత్తు మేడిగడ్డ కుంగిపోయింది. ఈ బ్యారేజ్ డిజైన్, నిర్మాణంలో లోపాలు, అవినీతి లోపం వల్ల కూలిపోయిందని ఉత్తమ్ కుమార్ అన్నారు.
వందేళ్లు ఉండాల్సిన బ్యారేజీ.. కేవలం మూడేళ్లలోనే కుప్పకూలిపోయే స్థితికి వచ్చిందని ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు. కుంగిపోయిన బ్యారేజీ, పియర్ 20 కింద నుంచి పైవరకు ఏర్పడిన పగుళ్లను ప్రజంటేషన్ ద్వారా మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం నిర్వాకం, అవినీతి కారణంగా మేడిగడ్డ ఈ పరిస్థితిలో ఉందన్నారు. రూ.1800 కోట్లతో టెండర్లు పిలిచారు. కానీ తర్వాత అంచనా వ్యయం రూ.4500 కోట్లకు వెళ్లింది. అంటే ఎంత అవినీతి జరిగిందో అర్థం అవుతుంది. మాజీ సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా ఈ విషయంపై స్పందించలేదు. అన్నారం బ్యారేజీకి కూడా ఇలాంటి ప్రమాదం పొంచి ఉందని ఉత్తమ్ తెలిపారు.