హైదరాబాద్ నగరంలో స్పెషల్ గా ఓ సైక్లింగ్ ట్రాక్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డును అనుసరిస్తూ… అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఈ ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 21 కిలోమీటర్ల పొడవున ఈ ట్రాక్ ఉండనుంది. ఇది సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ కావడం విశేషం. కాగా.. ఈ ట్రాక్ కి శంకు స్థాపన రేపు చేయనున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.
నానక్‌రామ్‌గూడ నుంచి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) వరకు 8 కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు వరకు 13 కిలోమీటర్ల మేర ఈ ట్రాక్ ఉండనుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) వింగ్ అయిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) ద్వారా 4.5 మీటర్ల సైకిల్ ట్రాక్‌ను చేపట్టనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ నాటికి ఈ ట్రాక్ పూర్తి కానుందని కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.