తెలంగాణ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయన బర్త్‌డే ను ఘనంగా నిర్వహిస్తున్నారు. కానీ కేటీఆర్ మాత్రం ఆవేవి వద్దంటున్నారు.
KTR Birthday: గల్లీ నుంచి ఢిల్లీ(Delhi) వరకు నేడు కేటీఆర్ పేరు మారుమోగిపోతుంది. ఆయన రాజకీయ చతురత, మాటలతో ఓటర్లను ఆకట్టుకునే వాగ్దాటి, వ్యూహాల్లో తండ్రికి తగ్గ తనయుడు, యువతరానికి స్ఫూర్తి, వేదిక ఏదైనా ఆంగ్లంలో అనర్గలంగా మాట్లాడి ప్రపంచాన్ని మైమరపింపజేసే ఘనుడు కల్వకుంట్ల తారక రామారావు. గెలుపునకు షార్ట్ కట్స్ ఉండవు అని నమ్మి.. లక్షసాధనగా అడుగుల్లో వేగం పెంచుతూ ప్రజలకు చేరువుగా ఉంటూ సుపరిపాలన అందిస్తున్న కేటీఆర్ కు ‘హిట్ టీవీ’ తరపున 47వ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 46 వసంతాలు పూర్తి చేసుకుని 47లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఆయన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియాలో జాతర మొదలుపెట్టేశారు. తాను మాత్రం పుట్టిన రోజుకు బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టి డబ్బులు వృథా చేయకుండా అనాథాశ్రమాలలో సేవ చేయండని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న యూసుఫ్‌గూడలో ఉన్న స్టేట్ హోమ్‌లోని అనాథ పిల్లలకు సహాయం చేయడానికి ఆయన మంచి మార్గాలు ఆలోచిస్తున్నారట. అలాగే తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్‌ఏస్మైల్(#GiftASmile) పేరుతో 10వ, 12వ తరగతులు చదువుతున్న ప్రతిభావంతులైన 47 మంది పిల్లలకు, అలాగే వృత్తిపరమైన కోర్సుల నుండి మరో 47 మంది పిల్లలకు ల్యాప్ టాప్స్ తో పాటు వారికి రెండు సంవత్సరాల ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నారు. అలాగే పార్టీ శ్రేణులు తన అభిమానులు వృథాగా హోర్డింగుల, ఫ్లెక్సీల కోసం డబ్బులు వేస్ట్ చేయకుండా మంచి పనికోసం ఖర్చుచేయండి అంటూ కోరారు. కేటీఆర్ స్వభావం అర్థం చేసుకున్న ఆయన అభిమానులు ఈ సందర్భంగా మంచి పనులు చేస్తున్నారు. కేటీఆర్ బర్త్ డే సందర్భంగా 1000 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు రక్తం దానం చేసేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు అనాథలకు భోజనాలు పెట్టించటం, అవసరమైన వస్తువులు కొనివ్వటం, గిఫ్ట్ ఏ స్మైల్ కింద సైకిళ్లు పంచుతున్నారు.