ఏపీ సీఎం జగన్(CM Jagan) నేడు 47,037 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సోమవారం ఆయన గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. సీఆర్డీఏ పరిధిలోని కృష్ణాయపాలెం జగనన్న లేఅవుట్ లో పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేసి ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే వన మహోత్సవం సందర్భంగా సీఎం జగన్ మొక్కలు నాటుతారు. ఆ తర్వాత వెంకటపాలెంకు చేరుకుని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నారు.
అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై జగన్ ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకున్నప్పటికీ అందులో భాగంగా నేడు ఈ శంకుస్థాపన చేయనున్నారు. నవ రత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ స్వయంగా శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపోతే తాడేపల్లిలోని జగన్ నివాసం నుంచి రాజధాని ప్రాంతానికి కేవలం 7 కిలోమీటర్లు మాత్రమే ఉన్నప్పటికీ హెలికాప్టర్ వినియోగించడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే భారీ స్థాయిలో ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరగనుండటంతో ట్రాఫిక్ సమస్యలు వస్తాయని, అందుకే హెలికాప్టర్లో సీఎం జగన్ రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.