మునుగోడు ఉప ఎన్నిక వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నికకు నోటీఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. నోటిఫికేషన్ లు కూడా వేస్తున్నారు. ఈ క్రమంలో.. మంత్రి కేటీఆర్ బంఫర్ ఆఫర్ ఇచ్చారు.
ఈ ఎన్నికల్లో తమ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపిస్తే తాను మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. గురువారం కూసుకుంట్ల నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న కేటీఆర్… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రధాని మోదీ పై విమర్శల వర్షం కురిపించాడు.
ఈ నాలుగేండ్ల పాటు నియోజకవర్గాన్ని రాజగోపాల్ రెడ్డి పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఒక్కో ఓటును డబ్బు పెట్టి కొట్టాను అంటున్నాడు. ఇది ప్రజలపై బలవంతంగా రుద్దిన ఎన్నిక అని పేర్కొన్నారు. మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. దేవుళ్లను కూడా తమ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆయన చెప్పారు.పాకిస్తాన్, హిందూస్తాన్ తప్ప పనికొచ్చే ముచ్చట్లు మోడీ చెప్పరన్నారు. తిరుమలకు ధీటుగా యాదాద్రి ఆలయాన్ని అభివృద్ది చేసినట్టుగా కేటీఆర్ గుర్తు చేశారు యాదాద్రి ఆలయానికి మోడీ సర్కార్ ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ కంటే మోడీ పెద్ద హిందువా అని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికల ముందు విదేశీ బ్యాంకుల్లోని నల్ల ధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఆయన మోడీని ప్రశ్నించారు. మోడీ రూ. 15 లక్షలు ఇస్తే బీజేపీకి ఓటేయాలన్నారు. లేకపోతే తమ పార్టీకి ఓటేయాలని కేటీఆర్ కోరారు.