కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులు. నలుగురు కలిస్తే వర్గం, టీపీసీసీ చీఫ్‌కు సీఎల్పీ నేతకు పడదు, సీనియర్లకు జూనియర్ల మధ్య పొసగదు. అందుకోసమే ఆ పార్టీ ఇంచార్జీలను వెంట వెంటనే మార్చాల్సి వస్తోంది. ఇటీవల తెలంగాణ ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్‌ను తప్పించిన సంగతి తెలిసిందే. ఆయన రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారని.. సీనియర్లు ఢిల్లీ వెళ్లి మరీ కంప్లైంట్ చేశారు. దీంతో హై కమాండ్ వెంటనే అతనిని పదవీ నుంచి తప్పించింది. ఇంచార్జీగా మాణిక్ రావు ఠాక్రేకు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయన ఇవాళ (బుధవారం) హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ముఖ్యమైన పని ఏంటంటే, విడిపోయి ఉంటోన్న అందరూ నేతలను ఏకతాటిపైకి తేవడమే. మరీ కలహాల కాంగ్రెస్ పార్టీలో నేతలు.. దగ్గరవుతారో లేదో చూడాలీ.
బాధ్యతలు చేపట్టిన వెంటనే హైదరాబాద్ వచ్చారు మాణిక్ రావు ఠాక్రే. ఆయనకు వెల్ కం చెప్పేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కాంగ్రెస్ నేతలంతా చేరుకున్నారు. లోపలికి రానీయకపోవడంతో సీనియర్ నేత వీహెచ్ రచ్చ రచ్చ చేశారు. గాంధీ భవన్ చేరుకున్న తర్వాత రేవంత్ రెడ్డి, వీ హనుమంతరావు, భట్టి విక్రమార్క ఇతర నేతలు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అయితే గాంధీభవన్ రాకముందే, పార్టీ సమావేశానికి రావాలని సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇంచార్జీ ఠాక్రే ఫోన్ చేశారు. ఫోన్ తీసి మాట్లాడిన కోమటిరెడ్డి, పార్టీ సమావేశానికి రాలేనని చెప్పినట్టు తెలిసింది. ఇంచార్జీతో కూడా ఆయన ఖరాఖండిగా మాట్లాడేశారు. అక్కడికి రాలేనని.. కానీ బయట కలుద్దాం అని చెప్పారు. దీంతో ఠాక్రే మరీ బయట కలిసి, పార్టీని చక్కదిద్దే పనిచేసే అవకాశం ఉంది.
గత కొంతకాలంగా వెంకట్ రెడ్డి పార్టీతో అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు. రేవంత్ రెడ్డి టీమ్ చేసిన కామెంట్లపై మండిపడ్డారు. దానిపై రేవంత్ రెడ్డి సారీ చెప్పిన.. వెంకట్ రెడ్డి వినడం లేదు. ఇటీవల జరిగిన మునుగోడు బై పోల్‌లో సమయంలో కూడా దూరంగా ఉన్నారు. అతని సోదరుడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ అయినా వెంకట్ రెడ్డి దూరంగా ఉండటమే కాకుండా, తన తమ్ముడికి అనుకూలంగా పనిచేయాలని వాట్సాప్ ఆడియోను ఓ నేతకు పంపించారు. అదీ కాస్త వైరల్ కావడంతో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీచేసింది. దానికి ఫారిన్ టూర్లో ఉండే వెంకట్ రెడ్డి రిప్లై ఇచ్చారు. తర్వాత వివాదం సద్దుమణిగింది. ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి ఓడిపోయి.. సిట్టింగ్ సీటును టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అయినప్పటికీ పార్టీకి వెంకట్ రెడ్డి దూరం దూరంగానే ఉంటున్నారు.
మాణిక్ రావు ఠాక్రే కింకర్తవ్యం.. పార్టీలో అసంతృప్తులను కూల్ చేయడం. అందరూ కలిసికట్టుగా పనిచేయాలనే గురుతర బాధ్యత అతని భుజస్కందాలపై ఉంది. అందుకోసమే వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి ఇతర నేతలతో కలిసి మాట్లాడుతారు. వరసగా రెండురోజులు రాష్ట్రంలో ఉండి పార్టీని చక్కదిద్దే పనిలో ఉంటారు. ఇవాళ ముందుగా ఏఐసీసీ కార్యదర్శులతో మాట్లాడతారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీఏసీ సభ్యులను కలుసుకుంటారు. రేపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసే అవకాశం ఉంది. భేటీలో ఆయన ఏం చెబుతారనే అంశం హైప్ క్రియేట్ చేస్తోంది.