»Hyderabad Gets Indias Largest Musical Floating Fountain In Hussain Sagar
ట్యాంక్ బండ్ లో కొత్తందాలు.. జిగేల్ జిగేల్
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ప్రాంతం పూర్తిగా మారిపోయింది. కొత్త సచివాలయం నిర్మాణం, అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు, నీరా కేఫ్ ప్రారంభం, అమరవీరుల స్మారక చిహ్నం తదితర వాటితో హుస్సేన్ సాగర్ కొత్త రూపు సంతరించుకుంది.
హైదరాబాద్ లో పర్యాటక ప్రాంతాలు కొత్తందాలు సంతరించుకుంటున్నాయి. సందర్శనీయ స్థలాలు మరింత అందంగా తయారవుతున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ సరికొత్త హంగులు అద్దుకుంటోంది. ఇప్పటికే సికింద్రాబాద్ వెళ్లే మార్గం కొత్త రూపు దిద్దుకుంది. ఫుట్ పాత్ లు, బల్లలు, రెయిలింగ్, విద్యుద్దీపాలు కొత్తవి ఏర్పాటయ్యాయి. విగ్రహాల వద్ద పచ్చిక బయళ్లు ఆహ్లాదం నింపుతోంది. ఇప్పుడు సాగర్ లో కళ్లు జిగేల్ మనేలా ఏర్పాట్లు మొదలయ్యాయి. కళ్లు జిగేల్ మనేలా.. మనసు పులకరించేలా మ్యూజికల్ ఫౌంటేన్ హుస్సేన్ సాగర్ మధ్యలో ఏర్పాటు చేశారు. పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు సరికొత్తగా ఏర్పాటుచేసిన ఈ ఫౌంటెయిన్ ను గురువారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు.
మ్యూజికల్ ఫౌంటెయిన్ నిన్నటి నుంచి సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది. సంగీతానికి అనుగుణంగా నీళ్లు నాట్యం చేసేలా మ్యూజికల్ ఫౌంటైయిన్ రూపొందించారు. ఎన్టీఆర్ మార్గ్ నుంచి, సాగర్ బోటు షికారులోనూ ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్ ప్రదర్శనను చూడవచ్చు. రోజూ రాత్రి 7 నుంచి 10 గంటల వరకు మూడుసార్లు మ్యూజికల్ ఫౌంటెయిన్ ప్రదర్శన ఉంటుంది. వారాంతాలు, ప్రత్యేక రోజుల్లో ప్రదర్శనల సంఖ్య పెంచుతామని నిర్వాహకులు తెలిపారు.
దుబాయిలోని బుర్జ్ ఖలీఫా దగ్గర ఉన్నట్లుగా సచివాలయం, మరోవైపు అంబేడ్కర్, ఎదురుగా బుద్ధుడి విగ్రహం, అమర వీరుల స్మారక స్తూపం, వీటన్నింటికీ సరికొత్త శోభ చేకూర్చేలా ఈ ఫౌంటెయిన్ ఏర్పాటుచేశారు. రూ.17.02 కోట్ల వ్యయంతో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఈ ఫౌంటెయిన్, లేజర్ షో ఏర్పాటు చేశారు. ఈ మ్యూజికల్ ఫౌంటేన్ లుంబినీ పార్కు సమీపంలో హుస్సేన్ సాగర్ లో తేలియాడుతుంది. 180 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 90 మీటర్ల ఎత్తుతో హెచ్ఎండీఏ ఈ ఫ్లోటింగ్ ఫౌంటైన్ రూపొందించింది. వివిధ థీమ్ లతో పొగమంచు ఫెయిరీ ఫాగ్, క్లౌడ్ ఎఫెక్ట్ ను సృష్టిస్తూ అద్భుత దృశ్యాలు సాగర జలాల్లో ఆవిష్కృతమవుతున్నాయి. ఆహ్లాదకరంగా సంగీతాన్ని పర్యాటకులు, సందర్శకులు ఆస్వాదించవచ్చు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తమ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్ అడుగులు వేస్తోందని చెప్పారు.
మారిన రూపురేఖలు
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ప్రాంతం పూర్తిగా మారిపోయింది. సికింద్రాబాద్ (Secunderabad) వెళ్లే మార్గంలో అద్భుతంగా ట్యాంక్ బండ్ (Tankbund) ను తీర్చిదిద్దారు. ఇక కొత్త సచివాలయం నిర్మాణం, అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు, నీరా కేఫ్ ప్రారంభం, అమరవీరుల స్మారక చిహ్నం తదితర వాటితో హుస్సేన్ సాగర్ కొత్త రూపు సంతరించుకుంది. ప్రస్తుతం ఫార్ములా-ఈ రేసు ద్వారా ట్యాంక్ బండ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇక హైదరాబాద్ లో మరిన్ని ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నాయి. కేబుల్ బ్రిడ్జ్ (Cable Bridge) సరికొత్త పర్యాటక కేంద్రంగా ఏర్పడింది. దుర్గం చెరువు (Durgam Cheruvu) పర్యాటకులను అలరిస్తున్నది. ఇక గండిపేట చెరువు కొత్త అందాలు సంతరించుకుంది. గతంలో కళతప్పిన ఉస్మాన్ సాగర్ (Osman Sagar) ఇప్పుడు అద్భుతంగా తయారైంది.