»On Land Dispute Case Nampally Court Issued Summons To Rana And Suresh Babu
Hero Rana, Suresh Babu భూ వివాదంలో కొత్త మలుపు
ఈ వ్యవహారం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. కోర్టు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు ఇవ్వడంతో మరి సురేశ్ బాబు, రానా హాజరవుతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
హైదరాబాద్ ఫిలిం నగర్ (Film Nagar)లోని ఓ భూ వివాదం కీలక మలుపు తిరిగింది. ఖరీదైన స్థలం విషయంలో నటుడు రానా (Rana), నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు (Daggubati Suresh Babu)పై కేసులు నమోదయ్యాయి. తమను దౌర్జన్యంగా స్థలం నుంచి ఖాళీ చేయించారని ప్రమోద్ కుమార్ పచ్వా (Pramod Kumar Pachwa) న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో పెదనాన్న, అబ్బాయిలపై బంజారాహిల్స్ కేసులు నమోదు చేశారు. స్థలం ఖాళీ చేయకపోతే తమ అంతు చూస్తామని సురేశ్ బాబు బెదిరింపులకు పాల్పడినట్లు ప్రమోద్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంపై ఆయన కోర్టును ఆశ్రయించారు. విచారణ చేసిన న్యాయస్థానం సురేశ్ బాబు, రానాకు సమన్లు (Summons) జారీ చేసింది. విచారణకు రావాలని ఆదేశాలు ఇచ్చింది.
ఈ మేరకు జనవరి 19వ తేదీన సురేశ్ బాబు, రానాకు నాంపల్లి కోర్టు (Nampally Court) సమన్లు జారీ చేసింది. వ్యక్తిగతంగా విచారణకు వారిద్దరితో పాటు మరికొందరిని రావాలని కోరుతూ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విచారణను మే 1వ తేదీకి వాయిదా పడింది. ఈ వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. కోర్టు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు ఇవ్వడంతో మరి సురేశ్ బాబు, రానా హాజరవుతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయమై తమ న్యాయవాదులతో వారిద్దరూ చర్చిస్తున్నారని సమాచారం. విచారణపై ఎలా ముందుకు వెళ్తే మంచిదో సంప్రదింపులు చేస్తున్నారు. అయితే వ్యక్తిగత హాజరు నుంచి వీరు మినహాయింపు కోరే అవకాశం ఉంది. తమ తరఫున తమ న్యాయవాదిని విచారణకు పంపేలా కనిపిస్తోంది.
వివాదం ఏమిటంటే..
హైదరాబాద్ ఫిలింనగర్ కో-ఆపరేటివ్ సొసైటీలో 1007 గజాల స్థలం అమ్మకం విషయంలో వివాదం మొదలైంది. షేక్ పేట మండలం సర్వే నం.403లోని ఫిలింనగర్ రోడ్డు నంబర్ 1లో సినీ నటి మాధవికి చెందిన ప్లాట్ ఉంది. ప్లాట్ నంబర్ -2లో ఉన్న 1007 గజాల స్థలాన్ని సురేశ్ బాబు కొనుగోలు చేశారు. దాని పక్కనే నటుడు వెంకటేశ్ స్థలం ఉంది. ప్లాట్ నంబర్-3లోని వెయ్యి గజాలను సురేశ్ బాబు కుటుంబం 2014లో హోటల్ నిర్మాణం కోసం ప్రమోద్ కుమార్ కు లీజుకిచ్చారు. 2018 ఫిబ్రవరితో లీజు ముగుస్తుండగా ప్లాట్ నంబర్ -2లోని స్థలాన్ని రూ.18 కోట్లకు విక్రయించేందుకు సురేశ్ బాబు అంగీకరించారు. దీంతో రూ.5 కోట్లు చెల్లించి ప్రమోద్ తో పాటు ఇతరులు సేల్ డీడ్ కుదుర్చుకున్నారు.
ఈ ఒప్పందానికి ముందే సురేశ్ బాబు లీజు గడువు ముగిసినా తన స్థలాన్ని ప్రమోద్ ఖాళీ చేయడం లేదని కేసు వేశారు. స్థలం ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేశారు. అయితే రూ.5 కోట్లు అడ్వాన్స్ గా తీసుకుని స్థలం రిజిస్ట్రేషన్ చేయడం లేదని సురేశ్ బాబుపై ప్రమోద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై యథాతథ స్థితి కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ స్థలం వివాదంలో దాదాపు 5 కేసులు వివిధ కోర్టుల్లో ఉన్నాయి. ఈ వివాదం కొనసాగుతుండగానే ఏడాది కిందట సురేశ్ బాబు ఆ స్థలాన్ని రానాకు విక్రయించాడు. దీంతో నవంబర్ 1వ తేదీన రానాకు చెందిన ఆరుగురు స్థలంలోకి వచ్చి ప్రమోద్ సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించి తరిమేశారు. ప్రమోద్ ను కూడా బెదిరించారని సమాచారం. ఈ వ్యవహారంపై ఆ రోజే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందన లేకపోవడంతో నాంపల్లిలోని 3వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ను ఆశ్రయించారు.