»Telangana New Secretariat Inauguration Postponed Due To Election Code
Breaking: తెలంగాణ సచివాలయం ప్రారంభం వాయిదా
ఈనెల 17వ తేదీన తన జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ (KCR) అట్టహాసంగా సచివాలయ ప్రారంభోత్సవం నిర్వహించాలని భావించారు. దీనికోసం సచివాలయ పనులు ఆగమేఘాల మీద జరుగుతున్నాయి. అకస్మాత్తుగా రాష్ట్రంలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు రావడంతో ప్రారంభోత్సవం వాయిదా వేయలేక తప్పలేదు.
తెలంగాణ కొత్త సచివాలయం (Telangana New Secretariat) భవనం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ (MLC Election Schedule) శుక్రవారం విడుదల కావడంతో ఈ కార్యక్రమం వాయిదా పడక తప్పలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ (Election Code) అమల్లోకి రావడంతో ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 17వ తేదీన తన జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ (KCR) అట్టహాసంగా సచివాలయ ప్రారంభోత్సవం నిర్వహించాలని భావించారు. దీనికోసం సచివాలయ పనులు ఆగమేఘాల మీద జరుగుతున్నాయి. అకస్మాత్తుగా రాష్ట్రంలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు రావడంతో ప్రారంభోత్సవం వాయిదా వేయలేక తప్పలేదు.
సచివాలయం ప్రారంభోత్సవంపై ఎన్నికల సంఘంతో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి చేసిన సంప్రదింపులు ఫలించలేదు. ఎన్నికల సంఘం నుంచి ప్రతి స్పందన ఆశాజనకంగా లేదు. దీంతో ఇప్పటికే ప్రకటించిన రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక, హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక, రెండు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న నిర్ణయించిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం గురించి సీఎస్, కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపారు.
కారణమిదేనా?
అయితే సచివాలయ ప్రారంభోత్సవం వాయిదాకు ప్రధాన కారణం ఎన్నికల కోడ్ కాదని తెలుస్తోంది. ఇటీవల సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదిలోనే అపశ్రుతి రావడంతో కేసీఆర్ ప్రారంభోత్సవంపై వెనక్కి తగ్గారని సమాచారం. కేసీఆర్ కు నమ్మకాలు ఎక్కువ. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సచివాలయం అంటేనే కేసీఆర్ కు పడదు. వాస్తు దోషమని బంగారంలాగా ఉన్న భవన సముదాయాన్ని కూల్చివేసి కొత్తది కట్టారు. తీరా పనులు చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించడం అపవాదుగా కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా సచివాలయం ప్రారంభంపై మల్లగుల్లాలు పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రకటన రావడంతో ఇదే అదునుగా సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా వేసినట్లు సమాచారం.
ప్రముఖుల పర్యటన కూడా వాయిదానే..
ఫిబ్రవరి 17వ తేదీన జరుగాల్సిన సచివాలయ ప్రారంభోత్సవానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, బీఆర్ అంబేడ్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు తరలి వస్తారని ముందే ఖరారైంది. ముగ్గురు ముఖ్యమంత్రుల చేత ఈ సుందర భవనాన్ని ప్రారంభించాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. అయితే పరేడ్ మైదానంలో నిర్వహించాల్సిన బహిరంగ సభ విషయమై ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ సభ కూడా వాయిదా పడితే ముఖ్యమంత్రులు, జాతీయ నాయకుల తెలంగాణ పర్యటన కూడా వాయిదా పడే అవకాశం ఉంది.
కాగా తెలంగాణ సచివాలయం అందంగా ముస్తాబవుతోంది. అందమైన నగిషీలు, మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలు, ఫౌంటైన్లు, గార్డెన్లు, సహజసిద్ధమైన వెలుతురు.. విశాలమైన కార్యాలయాలు, గదులు, హెలీప్యాడ్ ఇవన్నీ తెలంగాణ సచివాలయంలో కనిపిస్తున్న దృశ్యాలు. ఒక స్టార్ హోటల్ ను తలదన్నేట్టుగా తెలంగాణ సచివాలయం నిర్మితమైంది. హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మితమవుతున్న ఈ సచివాలయం అందరినీ అబ్బురపరుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చరిత్రాత్మక భవనాన్ని నిర్మిస్తున్నారు.
150 ఏళ్లు నిలిచేలా, ప్రకంపనలు తట్టుకునేలా డిజైన్ చేసింది నిర్మాణ సంస్థ. నీలకంఠేశ్వరాలయం, వనపర్తి ప్యాలెస్, సారంగాపూర్ హనుమాన్ (Hanuman Temple) ఆలయం స్ఫూర్తిగా నిర్మాణం సాగుతోంది. వాస్తుపరంగా అన్నింటిని పక్కాగా ప్లాన్ చేసి ఈ సౌధం నిర్మిస్తున్నారు. ఈ కట్టడంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దాదాపు పది సార్లయినా ఈ భవన నిర్మాణ పనులను స్వయంగా వచ్చి పరిశీలించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి దగ్గరుండి మరి జాగ్రత్తలు, సూచనలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం హైదరాబాద్ గడ్డపై తెలంగాణ పౌరుషం.. ఆత్మగౌరవం తలకెత్తున్నట్టు ఈ నిర్మాణం ఉందని తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం 26.98 ఎకరాల్లో నిర్మాణమవుతున్న ఈ సుందర సౌధానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం అని నామకరణం చేశారు. 11 అంతస్తుల్లో ఈ భవనం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఆరు అంతస్తుల్లో సచివాలయ ప్రధాన భవనం ఉంది. మధ్యలో భవనంపైన ఐదంతస్తుల మేర భారీ గుమ్మటాలతో కూడిన సెంట్రల్ టవర్స్ ఉంటాయి. లోపల మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు తలదన్నేలా ఈ నిర్మాణం ఉంది. నిర్మాణం లోపల మరింత అందంగా.. సుందరంగా నిర్మాణాలు ఉన్నాయి. ఈ భవనానికి సంబంధించిన డ్రోన్ వీడియో ప్రజలను మరింత ఆకర్షిస్తోంది. ఈ మొత్తం నిర్మాణానికి దాదాపు రూ.1,350 కోట్లు ఖర్చు అవుతున్నట్లు సమాచారం.