రూ.6 లక్షల కరెన్సీ నోట్లతో పట్టుబడ్డ ఎక్సైజ్ శాఖ సీఐ అంజిత్ రావుపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. ఆయనను సస్పెండ్ చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.
Excise Ci Anjith Rao: మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఇప్పటికే ఈవీఎంలు చేరుకున్నాయి. ఎన్నికల సమయంలో విధులు నిర్వహించాల్సిన ఓ ఎక్సైజ్ సీఐ భారీగా డబ్బును తరలించారు. రూ.6 లక్షల నగదు తరలించగా.. కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుని పోలీసులకు పట్టించారు.
నిర్ధారించుకున్న ఎక్సైజ్ శాఖ.. సీఐ అంజిత్ రావును (Anjith Rao) విధుల నుంచి తప్పించింది. హెడ్ క్వార్టర్స్‌లో ఉండాల్సిన అంజిత్ రావు (Anjith Rao).. ఎందుకు బయటకు వెళ్లాడని అడిగింది. ఎమర్జెన్సీ అయితే పర్మిషన్ తీసుకొని వెళ్లాలి.. అలా చేయకపోవడంతో సస్పెండ్ చేస్తున్నామని పేర్కొంది. నిన్న సాయంత్రం నుంచి రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. నలుగురు గుమికూడి ఉండొద్దని ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం రోజున ఎక్సైజ్ సీఐ అంజిత్ రావు (Anjith Rao) రూ.6 లక్షలకు పైగా డబ్బు తీసుకొని వరంగల్ నుంచి మేడ్చల్ బయల్దేరారు. కారు చెంగిచర్ల సమీపంలో ఉండగా కారును కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఆ కారు తనిఖీ చేయగా సంచిలో నోట్ల కట్టలు భారీగా బయటపడ్డాయి. అంజిత్ రావు ఐడీ కార్డు కనిపించింది. కాంగ్రెస్ కార్యకర్తలు కారును ఆపి, పోలీసులకు అప్పగించారు. అంజిత్ (Anjith) కారును, నగదును పోలీసులు సీజ్ చేశారు. తమకు చెప్పకుండా బయటకు వెళ్లినందుకు, నోట్ల కట్టలతో పట్టుబడటంతో అంజిత్ను ఎక్సైజ్ శాఖ విధుల నుంచి తప్పించింది.