Etala Rajender: రూ.20 కోట్ల ఇచ్చి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను (Etala Rajender) హత్య చేసేందుకు పాడి కౌశిక్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఈటల భార్య జమున సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఈటల రాజేందర్ (Etala Rajender) మీడియా ముందుకు రాగా.. ప్రతినిధులు ఇదే ప్రశ్న వేశారు. ఇప్పుడు కాదు 4, 5 నెలల నుంచి తనను జాగ్రత్తగా ఉండాలని అంటున్నారని గుర్తుచేశారు. తాను భయపడే రకం కాదని తేల్చిచెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో నయీం బెదిరించాడని.. అతని నుంచి ఫోన్లు వచ్చేవని.. తన డ్రైవర్‌ను కిడ్నాప్ చేశాడని గుర్తుచేశారు. ఆ సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశానని.. అప్పటి సీఎం కిరణ్‌కు చెబితే చడీ చప్పుడు లేదన్నారు. అప్పుడే భయపడలే.. ఇప్పుడు బెదరబోనని తేల్చిచెప్పారు. ఎప్పుడూ ప్రజల్లో ఉంటాం అని.. ప్రజలే తమకు రక్షణ అని తేల్చిచెప్పారు. పోలీసుల చేత సెక్యూరిటీ పెట్టించుకునే పరిస్థితి లేదని చెప్పారు.
సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్ (Etala Rajender) విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి తప్పదన్నారు. బీఆర్ఎస్ నేతలకు డిపాజిట్ దక్కే పరిస్థితి లేదన్నారు. ధరణి పోర్టల్ డబ్బుల పంట పండించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. హుజురాబాద్ బీఆర్ఎస్ ఇంచార్జీ పాడి కౌశిక్ రెడ్డి గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ఆయన ముదిరాజ్‌లను దూషించారని పేర్కొన్నారు. దళిత సర్పంచ్ రామస్వామిని కూడా తిట్టారని పేర్కొన్నారు. గొల్ల, కురుమ, అందరూ వారికి లెక్కే లేదని చెప్పారు. మిగతా సామాజిక వర్గం నేతలను కూడా గడ్డి పోచల్లా చూస్తారని వివరించారు. ముదిరాజ్‌లకు ఆస్తులు లేకపోవచ్చు.. అంతస్తులు లేకపోవచ్చు ఆత్మగౌరవం మాత్రం మెండుగా ఉందని పేర్కొన్నారు. రోషం ఎక్కువ అని.. తమకు కోపం వస్తే మాడి, మాసి అయిపోతారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నేతలను కూడా పాడి కౌశిక్ రెడ్డి దూషించాడని వివరించారు. ఇదే విషయం నేతలకు చెబితే.. ఆయనకు మిషన్ అప్పగించరట.. ఆయనను ఏమీ అనమని చెప్పారని ఈటల రాజేందర్ (Etala Rajender) తెలిపారు. మన వర్గాల ఓట్లతో గెలిచి.. గంజిలాగ, గడ్డి పోచల్లా తీసివేస్తున్నారని పేర్కొన్నారు. జరిగిన పరిణామాలకు కారణం సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన నియమించిన కౌశిక్ ఇలా కామెంట్స్ చేస్తున్నారని.. దీనికి బాధ్యుడు కేసీఆర్.. ఆయనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు తమ నిరసన కొనసాగుతోందని స్పష్టంచేశారు. బీజేపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని.. బీజేపీ సర్పంచ్‌లకు బిల్లులు రావని గుర్తుచేశారు. ఎప్పుడూ పదవీ ఊడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఈటల రాజేందర్ (Etala Rajender) తెలిపారు.