తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు పంపించింది. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ హెచ్చరించింది. ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తిదాడి విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ నోటీసులు ఇచ్చింది.
KCR: ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం(EC) సీఎం కేసీఆర్(KCR)కు నోటిసులు పంపింది. అక్టోబర్ 30న బాన్సువాడలో ప్రజాశీర్వాద సభ జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి గురించి మాట్లాడుతూ చేసిన ప్రసంగం రూల్స్‌కు విరుద్ధమని ఈసీ లేఖలో పేర్కొంది. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ స్టార్ కాంపెయినర్‌గా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేసింది. ఇకపై ఇలాంటి ప్రసంగాలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఇది ఫస్ట్ వార్నింగ్ అని, ఇలా రెచ్చగొట్టే మాటలు ఎవరు మాట్లాడినా పార్టీ అనుమతులు రద్దు చేసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని గుర్తు చేసింది.
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్(BRS) అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆయన కోలుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆ ఘటనపై కేసీఆర్ స్పందించిన తీరు ప్రజలను రెచ్చగొట్టేలా ఉందని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించగా స్థానిక రిటర్నింగ్ అధికారి ఈ నెల 14న ఈసీకి రిపోర్ట్ చేసింది. నివేదిక ఆధారంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని ఈసీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.