ఈ రోజుల్లో కాస్త మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా… ప్రభుత్వ ఆస్పత్రి గడప తొక్కడం లేదు. కాస్త ఖర్చు అయినా ప్రైవేట్ ఆస్పత్రులకే వెళ్తున్నారు. దాదాపు ఉద్యోగాలు చేసేవారందరూ కంపెనీలు ఇన్సూరెన్సులు లాంటివి ఇస్తుండటంతో.. ప్రైవేట్ ఆస్పత్రులకు మొగ్గు చూపుతుంటారు. అలాంటిది.. ఓ కలెక్టర్ భార్య అయ్యి ఉండి.. తన డెలివరీ ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చేయించుకుంది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆ కలెక్టర్ ఎవరో ఏంటో తెలుసుకుందాం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య, ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ త్రిపాఠి సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రసవించారు. ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్ సంజీవయ్య ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించారు. అయితే.. బిడ్డ కాస్త బరువు ఎక్కువగా ఉండటంతో నార్మల్ సాధ్యపడలేదని.. ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ తర్వాత తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
ప్రభుత్వాసుపత్రి అంటే.. కేవలం పేదలకు మాత్రమే, డబ్బులు కట్టేలని వారు మాత్రమే వెళతారని, అక్కడ సరిగా చేయరని చాలా మంది ప్రజల్లో ఉండే అపోహలను కలెక్టర్, ఆయన భార్య తుడిచే ప్రయత్నం చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేయించి జిల్లా ప్రజలకు కలెక్టర్ దంపతులు ఆదర్శంగా నిలిచారు. జిల్లా కలెక్టర్ గా భవేశ్ మిశ్రా బాధ్యతలు చేపట్టాక జిల్లా వైద్య అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పించారు. వైద్య అధికారులతో చర్చిస్తూ రాష్ట్ర స్థాయి అధికారులకు తెలియజేస్తూ అన్ని రకాల వైద్య సేవలను ప్రారంభించారు.
ఈ క్రమంలో కలెక్టరే స్వయంగా తన భార్యను ప్రభుత్వ దవాఖానలో డెలివరీ కోసం అడ్మిట్ చేయించి జిల్లా ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించారు.