జాగిత్యాల జిల్లా (Jagityala district) బీర్పూర్ ఎంపీడీఓ ఆఫీస్ శిథిలావస్థకు చేరుకోవడంతో ఉద్యోగులు బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. కార్యాలయం పెచ్చులూడిపోతుండంతో నెత్తిమీద ఏదైనా పడొచ్చన్న భయంతో హెల్మెట్లు ధరించి విధులకు హాజరవుతున్నారు. 2016లో బీర్పూర్ మండలం ఏర్పడిన నాటి నుంచీ ఎంపీడీఓ (MPDO) కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతోంది. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఏడాది నుంచి పెచ్చులూడుతోంది. గతేడాది ఎంపీడీఓ మల్లారెడ్డి కూర్చుని ఉండగా ఆయన టేబుల్‌పై పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అప్పటి అదనపు కలెక్టర్ (Collector) కార్యాలయాన్ని మార్చాలని ఆదేశించారు. కానీ.. ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు.
ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడిపోతున్న కార్యాలయ ఉద్యోగులు ఇలా హెల్మెట్లు (Helmets) ధరించి విధులు నిర్వర్తిస్తున్నారు. కార్యాలయం మరో చోటుకు మార్చాలంటూ సమీపంలోని అంజన్న ఆలయంలో కూడా వారు మొక్కుకున్నారు. ఆఫీసుని మరో భవనంలోకి మార్చాలని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. మరో దారి లేక తమ ప్రాణాలను కాపాడుకునేందుకు హెల్మెట్లు పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు ఉద్యోగులు(employees). ఎప్పుడు ఏ పెచ్చు ఊడి మీద పడుతుందోనని, ఎప్పుడు ఆ భవనం కూలిపోతుందోనని భయపడుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నట్లు ఉద్యోగులు వాపోయారు. వివిధ పనుల కోసం ఎంపీడీవో ఆఫీసుకి వస్తున్న ప్రజలు ఉద్యోగుల కష్టాలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు (Superiors) స్పందించాలని, మానవతా కోణంలో ఆలోచన చేయాలని, ఆఫీసుని మరో భవనంలోకి మార్చి తమ ప్రాణాలను కాపాడాలని ఉద్యోగులు వేడుకుంటున్నారు.