»730 Days Child Care Leaves For Them Central Key Announcement
Child Care Leave: వారికి 730 రోజులు చైల్డ్ కేర్ లీవ్స్..కేంద్రం కీలక ప్రకటన
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. మహిళా, ఒంటరి పురుష ప్రభుత్వ ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్కి అర్హులని, వారు 730 రోజులు సెలవులు తీసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగుల సెలవుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల (Government Employees) శిశు సంరక్షణ సెలవులపై శుభవార్త చెప్పింది. మహిళలు, ఒంటరి పురుష ప్రభుత్వ ఉద్యోగులు 730 రోజులు చైల్డ్ కేర్ లీవ్స్ (Child Care Leave)కు అర్హులని సర్కార్ ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) తెలిపారు. బుధవారం దీనికి సంబంధించి పార్లమెంట్లో లిఖితపూర్వకంగా ఆయన వెల్లడించారు.
కేంద్ర వ్యవహారాలకు సంబంధించి సివిల్ సర్వీసెస్, ఇతర విభాగాల్లో నియమితులైన మహిళా, ఒంటరి పురుష ప్రభుత్వ ఉద్యోగులు ఈ సెలవులను వినియోగించుకునే అవకాశం ఉంది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్) రూల్స్ 1972లోని 43సీ ప్రకారం చైల్డ్ కేర్ లీవ్ (CCL)కి అర్హులని కేంద్రం తెలియజేసింది. అయితే వారి మొదటి ఇద్దరు పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకూ వారి సంరక్షణ కోసం మొత్తం సర్వీసులో గరిష్టంగా 730 రోజులు సెలవు తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. దివ్యాంగులైన పిల్లల విషయంలో మాత్రం వయోపరిమితి లేదని, జితేంద్ర సింగ్ లోక్ సభలో స్పష్టతనిస్తూ ప్రకటన చేశారు.