పదో తరగతి హిందీ పరీక్ష పేపర్ (SSC Paper leak) బయటకు రావడం లీకేజీ కాదని, అది మాల్ ప్రాక్టీస్ అని, దీనిని దయచేసి రాజకీయం చేయవద్దని వరంగల్ సీపీ రంగనాథ్ (Warangal Police Commissionerate) విజ్ఞప్తి చేశారు. విజయవాడ సత్యం బాబు కేసు (vijayawada sathyam babu case) సహా పలు ఆరోపణలు తన పైన తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ (BJP telangana chief bandi sanjay) చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సత్యం బాబు కేసు దర్యాఫ్తు అధికారిని తాను కాదని, స్పెషల్ ఆఫీసర్ గా తనను నందిగామకు పంపించారని చెప్పారు. ఈ కేసులో జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించిందని, టెక్నికల్ కారణాలతో హైకోర్టు కొట్టి వేసిందన్నారు. తనపై చేసిన ఆరోపణలను సంజయ్ రుజువు చేస్తే, అలాగే తనకు అక్రమాస్తులు ఉన్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పారు. హిందీ పేపర్ మాల్ ప్రాక్టీస్ కు సంబంధించి తాను సెటిల్మెంట్ చేసినట్లు ఆరోపించడం సరికాదన్నారు. కేసు విషయంలో నిజాయితీ ఉంటే మూడు సింహాలపై సీపీ ప్రమాణం చేయాలని చెబుతున్నారని, కానీ తాము ఉద్యోగంలో చేరే సమయంలోనే ప్రమాణం చేస్తామన్నారు. ప్రతి కేసులో ప్రమాణాలు చేస్తే ఇప్పటి వరకు పదివేల సార్లు ప్రమాణం చేయాలని, ఆ మాట వినడానికి ఆశ్చర్యంగా ఉందన్నారు.
బీజేపీ వాళ్ల పైన తప్పుడు కేసులు పెట్టాలనే ఉద్దేశ్యం తనకు ఏమాత్రం లేదని, రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్నట్లు చెప్పారు. తాను ఎవరి పక్షాన ఉంటానో ప్రజలకు తెలుసునని, కొన్ని కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవడం వల్లే వారికి బాధ కలిగి ఉండవచ్చునని చెప్పారు. తాను అనివార్య పరిస్థితుల్లో ఈ ప్రెస్ మీట్ పెట్టానని, తాను ఎలాంటి సెటిల్మెంట్లు చేయనని, ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించనివ్వాలన్నారు. సమస్యల పైన తమ వద్దకు వచ్చే వారికి పార్టీలకు అతీతంగా న్యాయం చేస్తామన్నారు. హిందీ ప్రశ్నాపత్రం కేసులో అంతకంటే ముందు జరిగిన దానిని కూడా తాము పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పారు. తన ఫోన్ కనిపించడం లేదని బండి సంజయ్ ఫిర్యాదు చేశారని, సీపీ వద్ద ఉందని చెబుతున్నారని, కానీ తన వద్ద లేదని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. బండి సంజయ్ తో తనకు ఎలాంటి గట్టు పంచాయతీ లేదని, దర్యాఫ్తు సంస్థలను బెదిరించే ప్రయత్నం చేయడం మంచిది కాదన్నారు.
కాగా, జైలు నుండి విడుదలయ్యాక బండి సంజ్ మాట్లాడుతూ.. వరంగల్ సీపీని వదిలి పెట్టే ప్రసక్తి లేదని, విజయవాడ సత్యం బాబు కేసు సహా ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారో తనకు తెలుసునని, అన్నీ బయటకు తీస్తానని చెప్పారు. దీనిపై సీపీ రంగనాథ్ స్పందించారు.