టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొండగల్లో దూకుడు పెంచారు. అధికార బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పూర్తిస్థాయిలో పావులు కదుపుతున్నారు రేవంత్. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొండగల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
కొడంగల్లో రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ ఆర్. జగదీశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. కొడంగల్ నియోజకవర్గంలోని దిగ్గజ నాయకుల్లో గుర్నాథ్ రెడ్డి ఒకరు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత గుర్నాథ్ రెడ్డికి ఉంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. తాజాగా గుర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం కొడంగల్ రాజకీయాల్లో పెను మార్పునకు నాంది పలుకుతుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గుర్నాథ్ రెడ్డి చేరికతో కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పని అయిపోయినట్టే అనే చర్చ సాగుతోంది.