Medigadda Barrage: కేటీఆర్ ది టూత్ పాలిష్ బతుకు: బండి సంజయ్
మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై బీజేపీ నేత బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, కేటీఆర్లపై విమర్శనాస్త్రాలను సంధించారు. కేటీఆర్ ది టూత్ పాలిష్ బతుకని షాకింగ్ కామెంట్స్ చేశారు.
మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) కుంగడంపై బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project) మోటార్లు మునిగిపోయాయన్నారు. ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిందని ఫైర్ అయ్యారు. ఈ ప్రాజెక్టులకు తానే ఇంజనీర్ అని చెప్పుకున్న కేసీఆర్ నుంచి వాటికయ్యే ఖర్చులను రికవరీ చేయాలని బండి సంజయ్ అన్నారు. కాసులకు కక్కుర్తిపడి బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం తెలంగాణ (Telangana) భవిష్యత్తును నాశనం చేస్తోందన్నారు.
నేడు కరీంనగర్ (Karimnagar)లోని మహాశక్తి ఆలయంలో బండి సంజయ్ జమ్మి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్పై, సీఎం కేసీఆర్ (Cm Kcr), కేటీఆర్ (KTR)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమీషన్ల మీద పెట్టే శ్రద్ధ క్వాలిటీపై పెట్టడం లేదని విమర్శించారు. ప్రాజెక్టును సందర్శించేందుకు ఇతర పార్టీ నేతలను ఎందుకు అనుమతించడం లేదని, మేడిగడ్డ ప్రాజెక్టు పరిస్థితిపై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ ది టూత్ పాలిష్ బతుకన్నారు. కేసీఆర్ సీఎం కాకపోయి ఉండుంటే కేటీఆర్ బిచ్చపు బతుకు అయ్యేదని ఆయన విమర్శించారు. కేటీఆర్ (KTR) లాగా తండ్రి పేరు చెప్పుకుని తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. అధికారమదంతో కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, అమెరికాలో చిప్పలు కడిగిన విషయాన్ని కేటీఆర్ మర్చిపోయారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.