Balka Suman : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలు అయిపోగానే సీఎం రేవంత్ రెడ్డి తన మద్దతు దారులతో కలిసి బీజేపీలోకి వెళ్తారని బాల్క సుమన్ ఆరోపించారు. శనివారం బాల్క సుమన్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీతో చెట్ట పట్టాలు వేసుకుని తిరుగుతున్నాడన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడన్నారు. ఇటీవల తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడీని రేవంత్ రెడ్డి పెద్దన్న అన్నప్పుడే ఈ విషయం అర్థమైందన్నారు. రేవంత్ రెడ్డి తన వాళ్లకు తీసుకోని తొందరలోనే బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడని కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే రేవంత్ రెడ్డి తెలంగాణలో మరో ఏక్ నాథ్ షిండే, హేమంతబిశ్వశర్మ కావడం ఖాయమన్నారు.
ఇటీవల బేగంపేట విమానాశ్రయంలో గురు శిష్యులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య రెండు గంటల పాటు సంభాషణ జరిగిందన్నారు. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత చంద్రబాబు ఆయన అనుచరులను బీజేపీలోకి పంపించాడు. ఇప్పుడు కూడా ఆయన మరో శిష్యుడు రేవంత్ రెడ్డిని బీజేపీలోకి పంపేందుకు సిద్ధంగా ఉన్నాడంటూ ఆరోపించాడు. రేవంత్ రెడ్డి మా శిష్యుడేనని.. మీరూ ఒకే అంటే బీజేపీలోకి తీసుకుని వస్తానని చంద్రబాబు నాయుడు మోడీకి హామీ ఇచ్చాడని తెలిపాడు. గురు శిష్యుల బంధం బీజేపీ కోసం కృషి చేస్తున్నాయని ఆగ్రహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానని.. రేవంత్ రెడ్డితో మీకు పెను ప్రమాదం త్వరలో చోటు చేసుకోబోతుందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని బాల్క సుమన్ అన్నారు.