Lok Sabha Elections 2024 : 2024 లోక్‌సభ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పుడు దేశమంతా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం ప్రారంభించాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఈసారి 400కు పైగా సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు కాంగ్రెస్, ఇతర పార్టీలు కూడా తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఏప్రిల్ లేదా మేలో ఓటింగ్ జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా, లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం పేరు మీద ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నిజమా? ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించిందా? ఏది నిజం.
వాట్సాప్‌తో సహా ఇతర సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో వైరల్ అవుతున్న లేఖలో 2024 లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ మార్చి 28 నుండి ప్రారంభమవుతుందని ఉంది. ఏప్రిల్ 19న ఓటింగ్ జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. మే 22న ఓట్ల లెక్కింపు ప్రారంభమై అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి. దీని తర్వాత మే 30న కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. కానీ, ఇది సరైనది కాదు. ఇది నకిలీ లేఖ. ఎన్నికల కమీషన్ స్వయంగా తన నిజాన్ని బయటపెట్టింది. వాట్సాప్‌లో వైరల్ అవుతున్న ఈ లేఖ నకిలీదని ఎన్నికల సంఘం ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
A fake message is being shared on Whats app regarding schedule for #LokSabhaElections2024#FactCheck: The message is #Fake. No dates have been announced so far by #ECI.
— Election Commission of India (@ECISVEEP) March 8, 2024
వైరల్ లేఖను ఈసీ పోస్ట్‌లో కూడా షేర్ చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి ఓ నకిలీ లేఖ వాట్సాప్‌లో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ ఫేక్. భారత ఎన్నికల సంఘం ఇంకా తేదీలను ప్రకటించలేదు. ఎన్నికల తేదీలను ప్రకటించాల్సిన సమయంలో కమిషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తుంది. దీన్నిబట్టి సార్వత్రిక ఎన్నికల తేదీలకు సంబంధించిన వైరల్ లేఖ నకిలీదని స్పష్టమవుతోంది. లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి. నామినేషన్ల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది. ఎన్ని దశల్లో ఓటింగ్ జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు రానున్న రోజుల్లో లభించనున్నాయి.