Congress : రేవంత్ రెడ్డిపై 89 పోలీసు కేసులు..ఆస్తులు, అప్పులూ ఎన్నికోట్లంటే
నేడు నామినేషన్ల సందర్భంగా ప్రధాన పార్టీ ముఖ్య నేతలంతా నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా వారి వారి ఆస్తులు, అప్పులను అఫిడవిట్లో వెల్లడించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా తనపై 89 పెండింగ్ కేసులు ఉన్నాయని, తనకు రూ.1.30 కోట్ల అప్పు ఉందని అఫిడవిట్లో నమోదు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేడు చాలా మంది నామినేషన్లు వేశారు. గురువారం మంచి రోజు కావడంతో తెలంగాణలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా చాలా మంది నామినేషన్ వేేశారు. ఈ సందర్భంగా వారి వారి ఆస్తులను, అప్పులను అఫిడవిట్లో చేర్చారు. ఈ తరుణంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన ఆస్తులు, అప్పులను వెల్లడించారు.
ఈసారి కొడంగల్, కామారెడ్డిల నుంచి ఆయన బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. రెండు చోట్లా నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అఫిడవిట్లో పేర్కొన్న దాని ప్రకారంగా రేవంత్ రెడ్డి వద్ద రూ.5.34 లక్షల నగదు ఉందని, అలాగే ఆయన భార్య గీతా రెడ్డి పేర్ల మీద స్థిర, చరాస్తుల విలువ రూ.30.95 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్ లో తెలిపారు. అలాగే తనపై 89 పెండింగ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంకా తన వద్ద రూ.2 లక్షల విలువ చేసే పిస్టల్, రూ.50 వేల విలువ చేసే రైఫిల్ ఉన్నట్లుగా రేవంత్ తన ఎన్నికల అఫిడవిట్లో నమోదు చేశారు.
రేవంత్ దంపతుల పేర్ల మీద రూ.1.30 కోట్ల అప్పులు ఉందని, ఒక హోండా సిటీ, మరో మెర్సిడిస్ బెంజ్ కార్లు ఉన్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి భార్య వద్ద రూ. 83.36 లక్షల విలువైన 1,235 గ్రాముల బంగారం ఉందన్నారు. రూ.7.17 లక్షలు విలువైన 9,700 గ్రాముల వెండి, వస్తువులు కూడా వున్నట్లు రేవంత్ రెడ్డి తన అఫిడవిట్లో నమోదు చేశారు.