»Cm Kcr Has 17 Crores Of Debt No Car No Land Registered In Affidavit
KCR: సీఎం కేసీఆర్కు రూ.17 కోట్ల అప్పు..కారు, భూమి లేదంటూ అఫిడవిట్లో నమోదు
తనకు కారు, భూమి లేదని, రూ.17 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని సీఎం కేసీఆర్ తన అఫిడవిట్లో నమోదు చేశారు. సెంటు భూమి కూడా తన పేరుపై లేదని, కుటుంబానికి 62 ఎకరాలు ఉన్నట్లు తెలిపారు. తనపై 9 పోలీస్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
తెలంగాణ ఎన్నికల (Telangana Elections) నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) అధినేత, సీఎం కేసీఆర్ (Cm Kcr) నేడు గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా ఆయన తన అఫిడవిట్ల (Affidavits)ను సమర్పించారు. నామినేషన్ పత్రాల్లో తనపై 9 కేసులు ఉన్నట్లు తెలిపారు. అలాగే తనకు రూ.17 కోట్లు అప్పు ఉందని, కారు, భూమి లేవని పేర్కొన్నారు. తన వద్ద ప్రస్తుతం రూ.2.69 లక్షల నగదు మాత్రమే ఉందన్నారు. తన పేరు మీద, తన సతీమణి శోభ పేరు మీద రూ.17 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నట్లు వెల్లడించారు.
తన పేరుపై 9 బ్యాంకు అకౌంట్లు (Bank Accounts), తన భార్య శోభ పేరుపై 3 బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని, గత 5 ఏళ్లలో బ్యాంకు డిపాజిట్లు రెండు రెట్లు పెరిగినట్లుగా తెలిపారు. తన కుటుంబం వద్ద రూ.17 లక్షలు విలువ చేసే 2.8 కిలోల బంగారు ఆభరణాలున్నాయన్నారు. స్థిరాస్తులగా రూ.17.83 కోట్లు, చరాస్తుల రూపంలో రూ.9.67 కోట్లు ఉన్నాయని, తన భార్య శోభ పేరుపై రూ.7.78 కోట్ల విలువైన చరాస్తులు, ఉమ్మడి ఆస్తిగా రూ.9.81 కోట్ల చరాస్తులున్నట్లు అఫిడవిట్లో వివరించారు.
తనకు రూ.17.27 కోట్ల అప్పు, తన కుటుంబం పేరుపై రూ.7.23 కోట్ల అప్పు ఉందని, తనకు సొంతంగా కారు, బైక్ లేదని తెలిపారు. అలాగే ట్రాక్టర్లు, జేసీబీ, హార్వెస్టర్లు మొత్తం కలిపి 14 వాహనాలున్నాయన్నారు. ఆ వాహనాల విలువ రూ.1.16 కోట్లు అని పేర్కొన్నారు. తనది రైతు కుటుంబమని, తన పేరు మీద సెంటు భూమి కూడా లేదన్నారు. తమకు ఉన్న భూమిని కుటుంబ ఆస్తిగా చూపించారు. అందులో కుటుంబానికి 62 ఎకరాలు ఉంటే, 53.30 ఎకరాలు సాగుభూమి, 9 ఎకరాలు వ్యవసాయేతర భూమిగా అఫిడవిట్లో సీఎం కేసీఆర్ చూపించారు.