CM KCR: పొన్నాల లక్ష్మయ్య దీవెన, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆశీర్వాదం జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పళ్లా రాజేశ్వర్ రెడ్డి లక్ష మెజార్టీతో విజయం సాధిస్తారని సీఎం కేసీఆర్ అన్నారు. జనగామలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కొన్ని కారణాల వల్ల ముత్తిరెడ్డికి టికెట్ ఇవ్వలేదని వివరించారు. జనగామ గెలిచే సీటు.. పొడగొట్టకోవద్దు.. అందుకే రాజేశ్వర్ రెడ్డిని బరిలో నిలిపానని తెలిపారు. యువకుడు, పళ్లా రాజేశ్వర్ రెడ్డిని దీవించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిస్థితులను సభ వేదికపై నుంచి కేసీఆర్ వివరించారు. సిద్దిపేట నుంచి సూర్యాపేట వెళ్లే సమయంలో బచ్చన్నపేట వద్ద ఆగి.. మాట్లాడే సమయంలో అందరూ పెద్ద వాళ్లు ఉన్నారని గుర్తుచేశారు. బచ్చన్నపేట చెరువు ఎండిపోవడంతో యువకులు పని కోసం పక్క ఊరికి వెళ్లారని తెలిసి ఏడ్చానని గుర్తుచేశారు. 8 ఏళ్లు కరువు వచ్చి.. చెరువులో చుక్క నీరు లేదని తెలిసి బాధ పడ్డానని వివరించారు. తాగునీటి కోసం 8 కిలోమీటర్ల నడిచేవారని తెలిసి ఆశ్చర్యపోయానని.. గోదావరి దగ్గర ఉన్న ఈ ప్రాంతంలోని పరిస్థితి చూసి కళ్ల నుంచి నీళ్లు తిరిగాయని వివరించారు. వారానికి ఒకసారి స్నానం చేసేవారిన తెలిసి మనసు దిగాలు పడిందని పేర్కొన్నారు.
తలాపున మల్లన్నసాగర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా ఈ ప్రాంత ప్రజలు సాగు, తాగు నీటి కష్టాలు తీరాయని వివరించారు. ఇప్పుడు ఏడాదిపాటు బచ్చన్నపేట చెరువు నిండుగా ఉందన్నారు. తలాపున మల్లన్నసాగర్, టప్పాసుపల్లి రిజర్వాయర్ ఉందని.. ఇక నీటి కష్టాలు తీరినట్టేనని పేర్కొన్నారు. 2, 3 లిప్టులు ఏర్పాటు చేస్తే జనగామలో 100 శాతం గ్రామాలకు నీటి సమస్య తీరుతుందని కేసీఆర్ అంటున్నారు. సమ్మక్క సారక్క బ్యారేజీలో నీటికి ఢోకా లేదన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు దేవాదుల వరం అని.. ఒక్క ఓరుగల్లు మాత్రమే ఆ నీటిని వినియోగించుకుంటుందని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ చూసిన వడ్లు పోసి కనిపించడం, కొనుగోలు కేంద్రాల్లో చూసి సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అత్యధిక వడ్లు పండించే తాలుకా జనగామ అయ్యిందని చెప్పారు. అమ్మవారి దయ వల్ల రాష్ట్రంలో లక్ష్మీ దేవత తాండవిస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్- వరంగల్ ఎకనామిక్ గ్రోత్ సెంటర్ మార్గంలో జనగామ, భువనగిరి రెండు పాయింట్లను పెట్టానని కేసీఆర్ వివరించారు. ఇండస్ట్రీ, ఐటీ కారిడార్ ఏర్పడతాయని.. వంద శాతం డెవలప్ అవుతుందని అంటున్నారు.
ధరణితో విప్లవాత్మక మార్పులు
ధరణితో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం అని.. మీ భూమి మీద మీకే హక్కు ఉంటుందని స్పష్టంచేశారు. పీసీసీ చీఫ్, సీఎల్పీ నేత ధరణిని బంగాళాఖాతంలో వేస్తారని అంటారు.. అలా చేస్తే నష్టపోయేది మీరేనని చెప్పారు. మీరు వేసు ఓటు రాష్ట్ర దిశ దశ మారుస్తోంది.. ఆలోచించి వేయాలని కోరారు. బంగారు కత్తి అని మేడకోసుకుంటామా అని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ 3 గంటలకు కరెంట్ ఇస్తే సరిపోతుందని అంటోంది.. అలా అయితే గతంలో ఉన్న పరిస్థితి వస్తోందని తెలిపారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు.
పళ్లా హుషారు ఉన్నాడు..
పళ్లా రాజేశ్వర్ రెడ్డి హుషారు ఉన్నాడు అని కేసీఆర్ అన్నారు. సభకు వచ్చి మాట్లాడి పోమ్మని.. ఇప్పుడు అదీ చేయాలి.. ఇదీ చేయాలి అంటున్నారని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీ వస్తే.. నర్సింగ్ కాలేజీ, పారా మెడికల్ కాలేజీ వస్తోందని.. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తానని ప్రకటన చేశారు. రాజేశ్వర్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి.. నా ఇంట్లో ఉంటడు.. మీకు ఏం కావాలన్నా ఇట్టే జరిగిపోతాయి. కేసీఆర్ పక్కన ఉండే వ్యక్తి అని చెప్పారు. చివరగా చేర్యాలకు వస్తానని.. అక్కడ అందరూ తన స్నేహితులు ఉన్నారని వివరించారు. 2, 3 వేల మంది తనకు తెలిసిన వారు ఉన్నారని గుర్తుచేశారు.