IPL హైదరాబాద్ కు రెండో విజయం.. రూ.13.25 కోట్లకు Harry Brook న్యాయం
ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ఫీల్డింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ముఖ్యంగా క్యాచ్ లు భారీగా చేజార్చుకున్నారు. క్యాచ్ లను విజయవంతంగా పట్టి ఉంటే కోల్ కత్తా భారీ తేడాతో ఓడిపోయేది.
ఐపీఎల్ (TATA IPL)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) రెండో విజయం సొంతం చేసుకుంది. కోల్ కత్తా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)పై 23 పరుగులతో హైదరాబాద్ ఓడించింది. సొంత గడ్డ ఈడెన్ గార్డెన్స్ లో నైట్ రైడర్స్ కు హైదరాబాద్ చుక్కలు చూపించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. భారీ లక్ష్య చేధనకు దిగిన నైట్ రైడర్స్ నిర్ణీత ఓవర్లకు ఏడు వికెట్లు నష్టపోయి అతికష్టంగా 205 పరుగులు సాధించింది. ఓపెనర్ గా దిగిన హ్యారీ బ్రూక్ (Harry Brook) (100 నాటౌట్: 55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఐపీఎల్ వేలంలో రూ.13.25 కోట్లు భారీగా వెచ్చించి కొనుగోలు చేసినందుకు అదే రీతిలో బ్రూక్ ప్రదర్శన చేశాడు. కాగా ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ఫీల్డింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ముఖ్యంగా క్యాచ్ లు భారీగా చేజార్చుకున్నారు. క్యాచ్ లను విజయవంతంగా పట్టి ఉంటే కోల్ కత్తా 150 పరుగులకే కట్టడి అయ్యి ఉండేది.
బౌలింగ్ కు మంచి పేరున్న సన్ రైజర్స్ ఈసారి బ్యాటింగ్ లోనూ చక్కటి ప్రదర్శన కనబర్చింది. ఓపెనర్లుగా దిగిన మయాంక్ అగర్వాల్ (9) త్వరగానే ఔటవగా బ్రూక్ (100*) మాత్రం చివరి వరకు నిలబడి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. రాహుల్ త్రిపాఠి (9) త్వరగానే వెళ్లిపోగా మార్కరమ్ (50) (Aiden Markram) బ్రూక్ కు జతయ్యాడు. వీరిద్దరూ కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇక అభిషేక్ శర్మ (32) రాణించగా క్లాసెన్ మెరుపులు మెరిపించాడు. బ్రూక్, అభిషేక్ కలిసి 33 బంతుల్లోనే 72 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు.
హైదరాబాద్ ఇచ్చిన లక్ష్యాన్ని కోల్ కత్తా ఆరంభమే పేలవంగా ప్రారంభించింది. గుర్బాజ్ డకౌట్ కాగా వెంకటేశ్ అయ్యర్ (10), సునీల్ నరైన్ (0) వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. 4 ఓవర్లకు నైట్ రైడర్స్ 22/3తో పీకల్లోతు కష్టాల్లో మునిగింది. కానీ ఆ తర్వాత కెప్టెన్ నితీశ్ రాణా (Nitish Rana) (41 బంతుల్లో 75: 5 ఫోర్లు, 6 సిక్స్ లు) నిలకడైన ఆటతో పరుగులు రాబట్టాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన 6 ఓవర్లో నితీశ్ బ్యాట్ తో చెలరేగిపోయాడు. 4, 6, 4, 4, 4, 6 బాది ఉమ్రాన్ కు షాకిచ్చాడు. అనంతరం జగదీశన్ (36), రసెల్ (3) వరుస ఓవర్లలో ఔటవగా నితీశ్ గ్రౌండ్ లోనే ఉన్నాడు. గత మ్యాచ్ లో సిక్స్ లతో సంచలనం రేపి రింకు (58) రంగంలోకి దిగాడు. రింకుతో కలిసి నితీశ్ జట్టుకు భారీగా పరుగులు రాబట్టాడు. ఓటమిని ముందే ఖాయం చేసుకున్న కోల్ కత్తా నెట్ రన్ రేట్ తగ్గకుండా జాగ్రత్త పడేందుకు చివరి వరకు పోరాటం చేసింది. అయితే సన్ రైజర్స్ ఫీల్డర్ల తప్పిదాలు కోల్ కత్తాకు భారీగా కలిసి వచ్చింది. లేకపోతే 18 ఓవర్లకే కోల్ కత్తా కుప్పకూలి ఉండేది.