Sunil Gavaskar: అలా అయితేనే రోహిత్ గొప్ప కెప్టెన్.. లేదంటే: గవాస్కర్
ఐసీసీ ట్రోపీ గెలిస్తేనే అత్యుత్తమ కెప్టెన్‌గా పరిగణిస్తారని.. రోహిత్ శర్మను ఉద్దేశించి సునీల్ గవాస్కర్ అన్నారు. ద్వైపాక్షిక సిరీస్‌లలో విజయం దీనికి ప్రామాణికం కాదన్నారు.
Sunil Gavaskar: మరికొద్దీ రోజుల్లో ఆసియా కప్ జరగనుంది. ఆ తర్వాత వరల్డ్ కప్.. సో టీమిండియా ప్రదర్శనపై చర్చ జరుగుతోంది. ఇటీవల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ద్వైపాక్షి సిరీస్ వేరు.. ఐసీసీ ట్రోఫీ వేరు అంటున్నారు. వచ్చే రెండు టోర్నీల్లో తప్పకుండా విజయం సాధించాలని స్పష్టంచేశారు. అప్పుడే గొప్ప కెప్టెన్ల సరసన రోహిత్ నిలుస్తాడని చెబుతున్నారు.
వచ్చే రెండు టోర్నీల్లో గెలిచే సత్తా రోహిత్ శర్మకు ఉందని భావిస్తున్నానని గవాస్కర్ అంటున్నారు. అలాగే టీమ్‌లో నాలుగో స్థానం గురించి అంతా మాట్లాడుతున్నారు.. కానీ అదీ అసలు సమస్య కాదని అంటున్నారు. జట్టులో ఆల్ రౌండర్లు లేకపోవడం ఇష్యూ అని చెప్పారు. 1983, 1985, 2011 వరల్డ్ కప్ జట్లలో అలాంటి సమస్య లేదని గుర్తుచేశారు. అప్పుడు టాప్ ఆల్ రౌండర్లు ఉండేవారని.. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్ చేసే వారని తెలిపారు. కనీసం 8 ఓవర్లు వేసేవారని తెలిపారు. ఏ జట్టుకైనా ఇలాంటి ఆల్ రౌండర్లు ఉంటే అదనపు ప్రయోజనం అని తెలిపారు.
ధోని నాయకత్వంలో.. సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ బౌలింగ్ చేయగల సమర్థులు అని పేర్కొన్నారు. ప్రతీ జట్టుకు ఆల్ రౌండర్లు తప్పనిసరని సన్నీ అంటున్నారు. దాంతో అదృష్టం కూడా తోడవ్వాలని సూచించారు. నాకౌట్ స్టేజ్‌లో తీవ్రంగా కష్టపడినప్పటికీ లక్ ఉంటేనే విజయం సాధ్యం అవుతుందని తెలిపారు.