»Second Leg Of Ipl 2024 Expected To Take Place In Uae
IPL : ఐపీఎల్ రెండో షెడ్యుల్ మ్యాచ్‌లు దుబాయ్‌లోనా?
ఈ సంవత్సరం జరగబోయే ఐపీఎల్ రెండో షెడ్యుల్ మ్యాచ్‌లు ఇండియాలో జరగపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మ్యాచ్‌లు దుబాయ్‌కు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
IPL 2024 : ఐపీఎల్ 2024కు సంబంధించి టోర్నీ నిర్వహణ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుంది. వార్తలు వెలువడుతున్నాయి. భారత్‌లో లోక్ సభ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా పరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందన్న కోణంలో బీసీసీఐ ఆలోచిస్తోంది. ఐపీఎల్ మొదటి విడత షెడ్యుల్‌ని బోర్డు ఇప్పటికే ప్రకటించింది. మార్చి 22 నుంచి చెన్నై- బెంగళూరు మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభం అవుతుంది.
అయితే సార్వత్రిక ఎన్నికల తేదీలు వెలువడిన తర్వాత మిగిలిన మ్యాచ్‌ల డేట్లను ప్రకటిస్తామని బీసీసీఐ గతంలో తెలిపింది. రెండో విడత షెడ్యుల్‌ని(Second Schedule) విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు రెండో షెడ్యుల్కి సంబంధించి భారత్‌లో అసలు మ్యాచ్‌లు నిర్వహించాలా? వద్దా? అని తర్జనభర్జనలు పడుతూ ఉంది. యూఏఈ, దుబాయ్‌లకు మ్యాచ్‌లను షిఫ్ట్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
2009, 2014ల్లో ఎన్నికల సమయంలో జరిగిన ఐపీఎల్(Ipl) మ్యాచ్‌లను దక్షిణాఫ్రికా, దుబాయ్‌లో నిర్వహించారు. ఇప్పుడు కూడా అలా చేస్తే బాగుంటుందని బీసీసీఐ యోచనలో ఉంది. ఈ విషయంపై ఒకటి, రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లైవ్ మ్యాచ్‌లు చూసి ఆనందించాలని అనుకునే వారికి నిరాశ మిగులుతుందేమో వేచి చూడాల్సిందే మరి.