Ayodhya : అయోధ్య రామమందిరం పనులకు మరో 200మంది శిల్పులు
ఇప్పటికే ప్రారంభమై భక్తుల రద్దీతో ఉంటున్న అయోధ్య రామ మందిరం నిర్మాణ పనులు వచ్చే ఏడాది నాటికి పూర్తి చేస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Ayodhya Ram Temple Construction Work : అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు అన్నీ 2025 మార్చి నాటికి పూర్తి అవుతాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. పనులను శరవేగంగా పూర్తి చేయడానికి మరో 200 మంది శిల్పులను అదనంగా నియమించినట్లు తెలిపింది. ఆలయం బయట వైపు నిర్మించే చిన్న చిన్న ఆలయాలు, లిఫ్ట్ల్లాంటి పనులు 2025 డిసెంబరు నాటికి పూర్తి అవుతాయని చెప్పింది.
అయోధ్య రామ మందిరం(Ayodhya Ram Temple) గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున అయోధ్యకు తరలి వచ్చి బాల రాముడిని దర్శించుకుని వెళుతున్నారు. అయితే ఇప్పుడు మొదటి అంతస్తు, శిఖర నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. వీటిని మరింత వేగంగా పూర్తి చేసేందుకు అదనపు ఉద్యోగులను నియమించారు. అదనంగా మరో 200 మంది శిల్పుల చేత స్తంభాలను చెక్కిస్తున్నట్లు ట్రస్ట్ తెలిపింది.
ప్రధాన ఆలయం(temple) లోపల భాగంలో మరో 11 దేవాలయాలను నిర్మిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు అనిల్ మిశ్రా తెలిపారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు మరిన్ని శిల్పాలను కూడా తయారు చేయిస్తున్నామని చెప్పారు. ఈ పనులన్నీ కూడా 2025 చివరి నాటికి కచ్చితంగా పూర్తవ్వాలన్న ఉద్దేశంలో పని చేస్తున్నామన్నారు. అందుకనే అదనపు శిల్పులనూ ఉద్యోగంలోకి తీసుకున్నట్లు చెప్పారు.