Kohli: కోహ్లీ బయోపిక్కు రంగం సిద్ధం.. హీరో ఎవరంటే!?
చాలామంది జీవితాలను తెరపై ఆవిష్కరించేందుకు ట్రై చేస్తున్నారు ఉన్నారు మూవీ మేకర్స్. ముఖ్యంగా క్రికెటర్స్ బయోపిక్‌లు వరుస పెడుతున్నాయి. ఇప్పటికే ధోని, కపిల్ దేవ్ బయోపిక్‌లు వచ్చాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ బయోపిక్కు రంగం సిద్ధమవుతోంది.
ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో క్రికెటర్ల బయోపిక్‌లు తెరకెక్కుతునే ఉన్నాయి. తాజాగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన 800 సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు మరోసారి విరాట్ కోహ్లీ బయోపిక్ తెరపైకి వచ్చింది. చాలా రోజులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కోహ్లీ బయోపిక్‌ను ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తునే ఉన్నాయి.
గతంలో ఇండియా టుడే కాన్క్లేవ్ కార్యక్రమంలో చరణ్ మాట్లాడుతూ.. స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ చేయాలనుందని.. కుదిరితే కోహ్లీ బయోపిక్‌లో నటించాలని ఉందని.. లుక్ పరంగా తాను కొంత కోహ్లికి దగ్గరగా కనిపిస్తానని అన్నాడు. అప్పటి నుంచి కోహ్లీ బయోపిక్‌లో చరణ్‌ను ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ లేదనుకున్నారు. కానీ లేటెస్ట్ అప్డేట్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలీవుడ్ మేకర్స్ కోహ్లీ బయోపిక్ కోసం రంగం సిద్దం చేస్తున్నారట.
ఇప్పటికే ఓ బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ చరణ్‌ని కోహ్లీ బయోపిక్ కోసం అప్రోచ్ అయ్యారట. చరణ్ కూడా ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. చరణ్ సైడ్ నుంచి ఇంకా డెసిషన్ పెండింగ్‌లో ఉందనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం శంకర్‌తో కలిసి చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్నాడు చరణ్. ఆ తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అవగానే.. చరణ్ ఓకె చెబితే కోహ్లీ బయోపిక్ సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. ఒకవేళ చరణ్ గనుక కోహ్లీ బయోపిక్‌లో నటిస్తే మాత్రం.. మామూలుగా ఉండదని చెప్పొచ్చు.