»Ipl 2023 Rcb Defend 126 9 With Ease Beat Lucknow To Move To 5th In Standings
IPL 2023: లక్నో జెయింట్స్ ఘోర పరాభవం.. ఆర్సీబీ ఖాతాలో మరో గెలుపు..!
ఐపీఎల్ 2023 చాలా ఉత్సాహంగా సాగుతోంది. ఈ ఐపీఎల్ 16లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. లక్నో జెయింట్స్ ని స్వల్ప తేడాతో ఓడించింది.
ఐపీఎల్ 2023(IPL 2023) చాలా ఉత్సాహంగా సాగుతోంది. ఈ ఐపీఎల్ 16లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. లక్నో జెయింట్స్ ని స్వల్ప తేడాతో ఓడించింది. ఇటీవల పంజాబ్ కింగ్స్ తో లక్నో జెయింట్స్ తలపడినప్పుడు.. అత్యధిక స్కోర్ 257 పరుగులు చేసిన ఈ జట్టు.. నిన్నటి మ్యాచ్ లో మాత్రం తక్కువ స్కోర్ ని కూడా చేధించలేకపోయింది. 127 పరుగుల లక్ష్యఛేదనలో 108 పరుగులకి ఆలౌట్ అయిన లక్నో, 18 పరుగుల తేడాతో ఓడింది.
బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలించని లక్నో పిచ్ మీద ఛేజింగ్ కష్టమనే భావనతో బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్ మీద కోహ్లి, డుప్లెసిస్ ఆచితూచి బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 9 ఓవర్లలో 62 రన్స్ జోడించారు. కోహ్లి (31) ఔటయ్యాక.. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన బ్యాటర్లెవరూ ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. దీంతో బెంగళూరు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. 16.5వ ఓవర్లో జట్టు స్కోరు 109 పరుగుల వద్ద డుప్లెసిస్ (40 బంతుల్లో 44) ఐదో వికెట్‌గా వెనుదిరగ్గా.. కార్తీక్ (16) మినహా మిగతా బ్యాటర్లు రాణించలేకపోయారు. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 రన్స్ మాత్రమే చేసింది.
ఇక 127 పరుగుల లక్ష్యంతో అడుగుపెట్టింది లక్నో జెయింట్స్. తక్కువ స్కోర్ కాబట్టి.. చాలా సులభంగా గెలుస్తారని, గెలుపు లక్నో దే అనుకున్నారు. కానీ, లక్నో ఆ స్కోర్ అందుకోవడానికి కూడా చాలా కష్టపడింది. ఆర్సీబీ బౌలింగ్, ఫీల్డింగ్ అద్భుతంగా ఉండటంతో.. లక్నో ఏ దశలోనూ లక్ష్య చేధన దిశగా సాగలేకపోయింది. స్టోయినిస్ (19 బంతుల్లో 13), గౌతమ్ (13 బంతుల్లో 23) కాసేపు నిలదొక్కుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. 4 బంతుల వ్యవధిలో వీరద్దరూ పెవిలియన్ చేరడం లక్నోను దెబ్బతీసింది. చివరకు 18 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.