»Aus Vs Sl Australia Won The World Cup With A Solid Victory Over Sri Lanka
AUS vs SL : ప్రపంచకప్లో ఆస్ట్రేలియా బోణీ.. శ్రీలంకపై ఘన విజయం
భారత్లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో ఎట్టకేలకు ఆస్ట్రేలియా విజయం సాధించింది. లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
వన్డే ప్రపంచకప్ (ODI World Cup)లో ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఆస్ట్రేలియా (Australia) జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా భారత్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిన ఆసీస్ నేటి మ్యాచ్లో విజయం సాధించింది. లక్నో వేదికగా శ్రీలంక (SriLanka)తో జరిగిన మ్యాచులో 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని పొందింది. 210 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్ల నష్టానికి 35.2 ఓవర్లలోనే ఛేదించింది.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 43.3 ఓవర్లలో 209 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. లంక బ్యాటర్లలో ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక 61, కుశాల్ పెరీరా 78 పరుగులు చేసి హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అయితే మిగిలిన వారిలో చరిత్ అసలంక 25, కెప్టెన్ కుశాల్ మెండిస్ 9, సదీర సమరవిక్రమ 8, ధనుజంయ డిసిల్వా 7, కరుణరత్నే 2 పరుగులు చేసి విఫలం అయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టగా స్టార్క్, కమిన్స్ రెండేసి వికెట్లు, గ్లెన్ మాక్స్వెల్ ఓ వికెట్ తీశారు.