Maldives Elections: మాల్దీవుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి బ్యాలెంట్ బాక్సులను భారత్, శ్రీలంక, మలేషియాలో కూడా ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 21న జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం అభ్యర్థనలు చేసుకునేందుకు విధించిన గడువు శనివారంలో ముగిసింది. సుమారు 11 వేల మంది ఓటర్లు తమ కోసం పోలింగ్ స్టేషన్లు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. గతంలో మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు శ్రీలంక, మలేషియా నుంచి మాత్రమే రిజిస్టర్ చేసుకునేవారు.
ఈసారి కేరళలోని తిరువనంతపురం నుంచి 150 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఇక్కడ కూడా బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు మాల్దీవుల సెక్రటరీ జనరల్ హసన్ జకారియా తెలిపారు. మొత్తం 93 పార్లమెంట్ స్థానాలకు 389 మంది పోటీ చేస్తున్నారు. భారత అనుకూల మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ 90 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. అధ్యక్షుడు ముయిజ్జు నేతృత్వంలోని ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్, పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ కూటమి 89 స్థానాల్లో బరిలో ఉంది.