Katchatheevu : కచ్చతీవుపై భారత ఆరోపణలకు ఆధారాల్లేవన్న శ్రీలంక
జాలర్ల ప్రయోజనాలను పట్టించుకోకుండా కచ్చతీవు దీవిని కాంగ్రెస్ శ్రీలంకకు అప్పగించిందని మోదీ చేసిన ఆరోపణలకు సరైన ఆధారాల్లేవని శ్రీలంక మంత్రి స్పందించారు. ఈ విషయమై శ్రీలంక ఏమంటోందంటే..
Srilanka reaction on Katchatheevu : మోదీ చేసిన ట్వీట్‌తో మరోసారి కచ్చతీవుపై దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. జాలర్ల ప్రయోజనాలు పట్టించుకోకుండా కాంగ్రెస్(CONGRESS) పార్టీ ఆ దీవిని శ్రీలంకకు ఇచ్చి వేసిందని తాజాగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దీంతో పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఈ విషయమై శ్రీలంక సైతం స్పందించింది. భారత్ చెబుతున్న దానికి ఎలాంటి ఆధారం లేదని శ్రీలంక మంత్రి డగ్లస్ దేవానంద అన్నారు.
కచ్చతీవు దీవిని తిరిగి తమకు ఇచ్చేయాలన్న భారత విజ్ఞప్తికి ఎలాంటి ఆధారం లేదని దేవానంద అన్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి ఆరోపణలు చేయడం అసాధారణమేమీ కాదని అన్నారు. 1974లో ఇరు దేశాలకు మధ్య కచ్చతీవుపై ఒప్పందం జరిగిందని తర్వాత 1976లో ఆ ఒప్పందాన్ని సమీక్షించి సవరణలు చేశారని తెలపారు. కచ్చతీవు దీవి పరిసరాల్లో ఇరు దేశాలకు చెందిన జాలర్లు చేపలు పట్టకుండా నిషేధం ఉందని అన్నారు. కన్యాకుమారి దిగువన విస్తృతమైన సముద్ర వనరులతో కూడిన వెస్ట్ బ్యాంక్ అనే ప్రదేశం ఉందని, అది కచ్చతీవు కంటే 80 రెట్లు పెద్దదన్నారు. 1976లో భారత్‌కు దాన్ని ఇచ్చామని చెప్పారు.
కచ్చతీవు (KATCHATHEEVU) దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు(SRILANKA) ఇచ్చింది. ఆ తర్వాత భారత్‌లో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈ విషయమై వివాదం రగులుతూ ఉంది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు 178 మంది భారత జాలర్లను, 23 ఫిషింగ్ నౌకలను శ్రీలంక ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. తమ తమిళ మత్స్యకారుల్ని విడిపించాలంటూ ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ప్రతి సారీ కేంద్రానికి లేఖలు రాస్తున్నారు. తమిళ జాలర్ల అరెస్టుల్ని అడ్డుకోవడం లేదని డీఎంకే నేతలు మోదీని విమర్శిస్తున్నారు. దీంతో కాంగ్రెస్, డీఎంకేలను ఇరుకున పెట్టే ఉద్దేశంతోనే బీజేపీ నేతలు కచ్చతీవు అంశాన్ని మరోసారి తెరమీదకు తెచ్చినట్లు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.